‘బాబు నీ బుద్ధి మారదా?’
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న వామపక్షనేతలు
తిరుపతి అర్బన్ : సీఎం చంద్రబాబు బుద్ధిలో ఏ మాత్రం మార్పు రాలేదని.. ఆయనది ఎప్పుడూ కార్పొరేట్ ఆలోచనేనని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మండిపడ్డారు. సీపీఐతోపాటు ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడంపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ గేటు నుంచి లోనికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పి. మురళి మాట్లాడుతూ.. 17 మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం తీసుకొస్తే...చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటుగా ఉందని మండిపడ్డారు.55 శాతం సీట్లు.. ఒక్కో సీటు కోటికి అమ్ముకోవడం... 45శాతం సీట్లు కన్వీనర్ కోటలో ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ 100 శాతం సీట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు అందిస్తామని చెప్పి.. ప్రస్తుతం మాట తప్పినందుకు తక్షణమే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


