మన సంస్కృతి మహోన్నతం
తిరుపతి సిటీ : ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతీయ సంస్కృతి మహోన్నతమైనదని ఎన్‌ఎస్‌యూ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం ఈ మేరకు వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన మన సంస్కృతి అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగు, హిందీ ప్రతిభ పరీక్షల్లో విజేతలైన విద్యార్థులు ప్రతిభా పురస్కారాలు అందుకోవడం అదృష్టమన్నారు. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రాచీన భారతీయ విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తహసున్నీసా బేగం మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు. ప్రొఫెసర్ మాధవరావు, ఆర్‌కేఎస్ గ్రూప్ అధినేత బి.రూప్ కుమార్ రెడ్డి, మన సంస్కృతి సంస్థ డైరెక్టర్ డాక్టర్ షేక్ మస్తాన్, వే ఫౌండేషన్ అధినేత పైడి అంకయ్య, సమన్వయకర్తలు మహమూద్ అలీ పాల్గొన్నారు.


