అర్జీలపై శ్రద్ధ చూపండి
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు ఇచ్చే అర్జీల పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 363 అర్జీలు వచ్చాయి. అందులో ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై 225 అర్జీలను అందుకున్నారు. కలెక్టర్‌తోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, సుధారాణి అర్జీలను స్వీకరించారు. కలెక్టర్‌కు అర్జీలు ఇవ్వడానికి పోటీపడిన అర్జీదాలులు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు సోమవారం తమ అర్జీలను కలెక్టర్‌కు ఇవ్వడానికి పోటీ పడ్డారు. అధికారులు అర్జీలను స్వీకరిస్తున్నారని, లోనికి వెళ్లాలని సూచించినా 70 శాతం మంది అర్జీదారులు తమ అర్జీలను కలెక్టర్‌కు మాత్రమే ఇస్తామంటూ క్యూలోనే ఉండిపోయారు.
మా బిడ్డలకు సాయం చేయండి
తన భర్త, తన కుమారుడు షణ్ముగం మృతి చెందారు. కోడలు మంజుల కిడ్నీ సమస్యతో మంచానికే పరిమితం అయ్యిందని ముగ్గురు పిల్లల బాగోగులను తాను చూసుకుంటున్నానని భాస్కరమ్మ అనే మహిళ కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. సాయం చేసి ఆదుకోవాలని కోరింది. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.
ఒంటరి మహిళను..పింఛన్ ఇవ్వండి
తన భర్త తనకు దూరంగా ఉండిపోయారని నాయుడుపేట మండలంలోని దురదవాడ గ్రామానికి చెందిన బి. మాధవి వాపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు కుటుంబ పోషణ భారంగా మారుతుందని, పింఛన్ ఇప్పించాలని కలెక్టర్‌ను కోరింది.
దారి సమస్య పరిష్కరించండి
దారి సమస్య పరిష్కరించాలని తిరుపతి రూరల్ మండలం అంబేడ్కర్ నగర్‌కి చెందిన పలువురు ఎస్సీలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దామినేడు లెక్కదాఖలో దారి ఉండేదన్నారు. అయితే రత్నం అనే వ్యక్తి దారిలేదంటూ అభ్యంతరం చెబుతున్నారని వాపోయారు.
మద్యం షాపు మాకొద్దు
మద్యం షాపు మా కొద్దు..దాంతో తలనొప్పులు తప్పడం లేదంటూ పుత్తూరు పట్టణంలోని రామానాయుడు కాలనీకి చెందిన పలువురు మహిళలు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
సీఆర్పీల సమస్యలు పట్టించుకోరా?
సమగ్రశిక్షలో 14ఏళ్లుగా పనిచేస్తున్న సీఆర్పీల సమస్యలను పట్టించుకోవాలని వారు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
అర్జీలపై శ్రద్ధ చూపండి


