అమ్మగారు మళ్లీ తనిఖీలు!
ఆమె ప్రజాప్రతినిధి కాదు.. నామినేటెడ్ పదవి కలిగిన వారు కూడా కాదు. శాసనసభ్యుడి తల్లి. అయితే తరచూ ఆకస్మిక తనిఖీలు చేసి అధికారులకు హడలెత్తిస్తుంటారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ కొన్ని నెలల క్రితం శ్రీకాళహస్తి ఆలయంలో, స్థానిక ఆస్పత్రుల్లో, హాస్టళ్లతో తనిఖీలు చేశారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పట్లో జనం శ్రీకాళహస్తి షాడో ఎమ్మెల్యే అంటూ విమర్శించారు. ఆ తర్వాత కొద్ది రోజులు పర్యటనలు చేయలేదు. తాజాగా శనివారం విమానాశ్రయ సమీపంలోని గిరిజన గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. వసతి సదుపాయాలు, భోజన నాణ్యత, తరగతుల నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు పట్టికలు, విద్యా ప్రమాణాలు, పరిశుభ్రత అంశాలను ఆమె స్వయంగా పరిశీలించారు. నిర్వహణపై అధికారులను ప్రశ్నించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. – రేణిగుంట


