ఉద్యోగులపై క్రమశిక్షణ కొరడా
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులపై సీఎండీ శివశంకర్ కొరడా ఝుళిపించారు. విధుల్లో నిర్లక్ష్యం, అనధికారక సర్వీసులు ఇవ్వడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం వంటి అంశాలపై క్షు ణ్ణంగా పరిశీలించిన ఆయన ఏకంగా 25 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
ఎవరెవరిపై ఎందుకు చర్యలు తీసుకున్నారంటే..
తిరుపతి సర్కిల్‌లో ఏఈగా విధులు నిర్వహిస్తూ సీనియారిటీని పాటించకుండా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో పి.ఉత్తన్నకు రెండు ఇంక్రిమెంట్లు నిలిపివేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. తిరుపతి సర్కిల్‌లో విధు లు నిర్వహిస్తూ గోశాల, నీటి సరఫరా ప్లాంట్లకు అనధికారిక విద్యుత్ సర్వీసులను మంజూరు చేయడంతో డీఈఈ డి.వసంతయ్యకు రెండు ఇంక్రిమెంట్లు, ఏఈఈలు వీఎస్ గిరి, ఎస్.మెహబూబ్‌బాషా, లైన్ ఇన్‌స్పెక్టర్ టీడీ లక్ష్మీపతి, లైన్‌మన్ ఎన్.రాధాకృష్ణ, అసిస్టెంట్ లైన్‌మన్ బి.దామోదరం, ఎనర్జీ అసిస్టెంట్ కె. లోకేష్‌లకు ఒక ఇంక్రిమెంటు వంతున ఆపివేశారు. తిరుపతి సర్కిల్‌లో పనిచేస్తూ సంస్థ నిబంధనలను పాటించని అంశంలో ఏఈఈలు సి.రవిచంద్ర బాబు, ఎం.మోహన్‌రావు, బి.వెంకటరమణ, వై.బాలగున్నయ్యకు, కర్నూలు సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఏఈఈలు వై.గర్జప్ప, ఎన్.మద్దిలేటికి ఒక ఇంక్రిమెంట్ ఎందుకు నిలపకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చారు. తిరుపతి సర్కిల్‌లో పనిచేస్తూ అనధికారికంగా లైన్లను మార్చడం, విద్యుత్ సేవల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై ఏఈఈ ప్రసాద్, అసిస్టెంట్ లైన్‌మన్ జి.సాంబశివకు మూడు ఇంక్రిమెంట్లను ఎందుకు నిలపకూడదో చెప్పాలని షోకాజ్ జారీ చేశారు. కర్నూలు సర్కిల్‌లో డీఈఈగా పనిచేస్తూ అనధికారికంగా విధులకు గైర్హాజరైన డి.ఖాజావలికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
వీరిపై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ జారీ
నెల్లూరు సర్కిల్‌లో ఇటీవల ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వై.శివశంకరయ్య, కర్నూలు సర్కిల్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్.విశ్వశాంతి స్వరూప్ ఉన్నతాధికారుల ఆదేశాలను ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టినందుకు, గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్‌లో విద్యుత్ పరికరాల సంఖ్యను తప్పుగా నమోదు చేసిన విషయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. శంకరయ్య, ఏఈ బి.మల్లికార్జునకు, తిరుపతి సర్కిల్‌లో పనిచేసే ఏఈ ఎల్.చలపతి వ్యవసాయ విద్యుత్ సర్వీసులను జారీ చేయడంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్‌ను జారీ చేశారు.
జేఈపై సమగ్ర విచారణకు ఆదేశం
నెల్లూరు సర్కిల్‌లో జూనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న వి.వెంకటేశ్వర్లుపై వచ్చిన అవినీతి ఆరోపణలు, గ్రానైట్ ఫ్యాక్టరీకి అనధికారికంగా స ర్వీసును మంజూరు చేయడం, తన భార్య పేరుతో ఉన్న విద్యుత్ సర్వీసుపై బకాయిలు ఉన్నప్పటికీ సర్వీసును రద్దు చేయక పోవడం, విధులకు గైర్హాజరైన వాచ్ మ్యాన్‌కు అటెండెన్స్ ఇవ్వడం వంటి అంశాలపై సమగ్ర విచారణకు ప్రత్యేకాధికారిని నియమిస్తూ ఉత్వర్వులను జారీ చేశారు. అలాగే కడప సర్కిల్‌లో ఏఈగా విధులు నిర్వహించిన ఎన్. రాజశేఖర్‌రెడ్డి కోర్టు కేసుకు సంబంధించిన అప్పీల్‌ను సకాలంలో ఫైల్ చేయకపోవడంపై వివరణ ఇవ్వా లని ఆదేశించారు. నెల్లూరు సర్కిల్‌లోని ట్రైనింగ్ సెంటర్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధు లు నిర్వహిస్తూ అనధికారిక కార్యక్రమాలను చేశారన్న అభియోగంపై కె.హంజానవాజ్‌ఖాన్‌పై నివేదికను సమర్పించాల్సిందిగా నెల్లూరు ఎస్‌ఈని ఆదేశించారు. ఇంతకు ముందు తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై మరో ముగ్గురు ఉద్యోగుల చేసుకున్న అప్పీళ్లను తిరస్కరించారు. దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులపై విచారణ ప్రక్రియ జరుగుతున్నందున విచారణ పూర్తయిన తరువాత తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.


