ముమ్మరంగా ప్రభుత్వ స్కూళ్లలో సామాజిక తనిఖీ
తిరుపతి సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై సోషియల్ ఆడిట్ ప్రక్రియ ప్రారంభించినట్లు సమగ్రశిక్షా అభియాన్ సీఎంఓ సురేష్ చెప్పారు. పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై ఆరా తీసి, ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల కమిటీ సమక్షంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు పాఠశాల వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో తనిఖీలు చేస్తున్నారని చెప్పారు.
అన్ని వసతులు బాగుంటే గ్రేడ్–1
పాఠశాలలో అన్ని వసతులు బాగుంటే ఆ పాఠశాలను గ్రేడ్–1గా పరిగణిస్తున్నారు. మౌలిక వసతులు సరిగా లేని పాఠశాలలు, వసతి గృహాలకు గ్రేడ్ –4 స్థాయిని కేటాయించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 150 పాఠశాలలకు పైగా సామాజిక తనిఖీలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా పాఠశాలల్లోనూ. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ నాసిరకం భోజనాలు వడ్డిస్తున్నారని, విద్యార్థులకు తగిన సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారని విద్యార్థి సంఘాలు పలుసార్లు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జిల్లాలో పాఠశాలలు, వసతి గృహాల పరిస్థితిపై సోషల్ ఆడిట్ ద్వారా వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు ఆడిట్ జరిపి గ్రేడ్‌లను కేటాయించి ప్రభుత్వ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.


