ఇంధన పరిరక్షణపై సీఎండీ పోస్టర్స్ ఆవిష్కరణ
–19, 20 తేదీల్లో తిరుపతిలో ప్రత్యేక ఎగ్జిబిషన్
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 14వ తేదీ నుంచి జరిగే ఇంధన పరిరక్షణ వారోత్సవాల నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ గురువారం పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా తిరుపతిలో ఈనెల 19, 20 తేదీల్లో సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులకు ఇంధన పరిరక్షణ–అవశ్యకత అంశంపై స్టాల్స్ ఏర్పాటు పోటీలను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంధన పరిరక్షణ అంశంపై సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో విద్యార్థులకు వక్తృత్వపు, క్విజ్ పోటీలను నిర్వహిస్తారని, ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 17వ తేదీన తిరుపతి నుంచి ఆన్‌లైన్ ద్వారా ఫైనల్ రౌండ్ పోటీలను నిర్వహిస్తామన్నారు. అందులో విజయం సాధించిన వారికి 20వ తేదీన బహుమతుల ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కే. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, జనరల్ మేనేజర్ శ్రీనివాసులు, తిరుపతి ఎస్‌ఈ చంద్రశేఖరరావు, ఈఈ గంగాధర్‌రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయప్రకాష్, ఎన్జీవో సంస్థ ప్రతినిధి మధుబాబు పాల్గొన్నారు.


