గాయపర్చుకుని యువకుడు తిరుమలలో హల్‌చల్
తిరుమల : తిరుమలలో ఓ యువకుడు తనకు తాను చేతిని గాయపర్చుకుని హల్‌చల్ చేసిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. తిరుమల టూటౌన్ పీఎస్ సీఐ శ్రీరాముడు కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ, అబ్బాసియా కాలనీకి చెందిన గోగుల నగేష్ 20 ఏళ్ల కిందట కూలీ పనుల నిమిత్తం వచ్చి రేణిగుంటలో ఉంటూ భవన నిర్మాణ పనులకు తిరుమలకు వచ్చి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో నగేష్ కొడుకు శ్రీనివాస్(20) తిరుములలో ఉంటూ సమస్యలు సృష్టిస్తుండడంతో సంవత్సరం క్రితమే ఇతడిని తిరుమల నుంచి కిందకు పంపారు. అయితే ఇతను గురువారం తిరుమలకు చేరుకుని స్థానిక డీఎన్‌ఏ రోడ్డులో తన ప్రేమ విఫలమైందంటూ తనను తాను బ్లేడుతో గాయపరుచుకున్నాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, టీటీడీ భద్రతా సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిపై రౌడీషీట్‌ను ఓపెన్ చేయడంతోపాటు, అతని కుటుంబాన్ని తిరుమలకు రాకుండా పట్టణ బహిష్కరిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశించారు.


