రౌడీ షాడో
తిరుపతిలో జనసేన నేత దాదాగిరి
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తిరుపతిలో జనసేనకు చెందిన ఓ నేత యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నాడు. వివాదాస్పద స్థలాల్లో జోక్యం చేసుకుని సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ రౌడీయిజం చేలాయిస్తున్నాడు. తిరుపతి నగరంలో జీపు క్లీనర్‌గా జీవితం ప్రారంభించి, సినిమా టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తూ.. రోజువారీ బతుకుదెరువు సాగించిన వ్యక్తి, నేడు జనసేన అధికార కవచం వేసుకుని రెచ్చిపోతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆధ్మాత్మిక నగరంలో ప్రశాంతతకు విఘాతం కల్పించేలా సదరు షాడో ఎమ్మెల్యే దాదాగిరీ చేస్తున్నాడు. జనసేన నాయకుడి హోదాను కవచంగా చేసుకుని, దందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులతో పేద ప్రజలపై దౌర్జన్యాలకు దిగుతున్నాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్టేషన్లకి వచ్చే సాదాసీదా ఫిర్యాదుదారులు, దొంగతనం కేసులో పట్టుబడ్డ వారిని బెదిరించి నగదు వసూలు చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. రూ.కోట్ల విలువ చేసే వివాదాస్పద స్థలాల సెటిల్‌మెంట్లలో ఈ షాడో ఎమ్మెల్యే నీడ కనిపిస్తోందని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కుటుంబ, ఆస్తి, వ్యాపార వివాదాల్లోకి తలదూర్చి, ఒక్కో కేసుకి ఒక్కో రేటు కట్టి సెటిల్‌మెంట్ల పేరుతో డబ్బులు గుంజుతున్నాడనే ప్రచారం ఉంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలన్నా, కాంట్రాక్ట్ వర్కులు చేపట్టాలన్నా, ప్రభుత్వ, ప్రైవేట్ పనులకై నా సదరు షాడో ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడిందని జనసేన శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. నగరంలోని కొన్ని బార్లలో స్నేహితులతో కలిసి మద్యం సేవించి, బిల్లు చెల్లించకుండా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడనే వార్తలు జనసేన పార్టీలోనూ కలకలం రేపుతున్నాయి. గల్లీల్లో చిన్న రౌడీలా తిరిగే తన గతాన్ని మరిచి, నేడు ‘అంతా తానే’ అన్నట్టు అధికారులపై, సహచర నేతలపై కూడా జులుం ప్రదర్శిస్తున్నాడని జనసేన శ్రేణులే చర్చించుకుంటున్నాయి. తిరుపతి కార్పొరేషన్, ఇతర అధికారులతో సమావేశాల్లోనూ అసలు ఎమ్మెల్యేకు మించి అధికారం చలాయిస్తూ, ‘షాడో ఎమ్మెల్యే’గా తాను నిర్ణయించినదే తుది అన్నట్టు వ్యవహరిస్తున్నాడని చెవులు కొరుక్కుంటున్నాయి. ఆయన దుర్మార్గపు చర్యల కారణంగా పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అంతులేని అక్రమార్జన
తిరుపతి నగరంలోని ఎర్రమిట్టలో విలువైన స్థలంపై రెండు వర్గాల వారు కోర్టును ఆశ్రయించారు. రూ.కోట్ల విలువచేసే ఆ స్థలంపై ఈ షాడో ఎమ్మెల్యే కన్నేశాడని ప్రచారం జరుగుతోంది. ఇలా దందాలు, దౌర్జన్యాలతో సంపాదించిన సొమ్ముతో నేడు సీపీఆర్ విల్లాలో రూ.కోటిన్నర విలువ చేసే ప్లాట్, విలువైన కారు కొనుగోలు చేసినట్లు జనసేన నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు. షాడో ఎమ్మెల్యే నిర్వాకం ఎక్కడికి దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.


