శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,677 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,732 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.26 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
తిరుపతి మీదుగా
చైన్నెకి బుల్లెట్ రైలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : హైదరాబాద్– చైన్నె వయా తిరుపతి బుల్లెట్ రైలు నడిపేందుకు రైల్వేశాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు 223.44 హెక్టార్ల భూమి సేకరించాలని కోరింది. ఈ హైస్పీడ్ మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి తిరుపతికి కేవలం 2.20 గంటల ప్రయాణంతో చేరుకోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని వివరిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ న్యాయ విభాగం
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యుగంధర్‌రెడ్డి
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ న్యాయ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతికి చెందిన పదిరి యుగంధర్‌రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
రేపటి నుంచి దివ్యాంగులకు క్రీడాపోటీలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్బంగా జిల్లాలోని దివ్యాంగులకు ప్రోత్సాహం, నైతిక మద్దతు అందించేందుకు వివిధ క్రీడలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ శుక్రవారం, శనివారం ఎదయం 10 గంటలకు తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో క్రీడా పోటీలు ఉంటాయని వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. అలాగే డిసెంబరు 6వ తేదీన తిరుపతి కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవానికి జిల్లాలోని దివ్యాంగులు హాజరుకావాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు


