కురియన్ సేవలు మరువలేం
చంద్రగిరి : మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ వర్గీస్ కురియన్ సేవలు మరువలేమని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం ఇండియన్ డైరీ అసోసియేషన్, కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ, ఎస్‌వీ వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో జాతీయ పాల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కురియన్ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, గ్రామీణ పాల ఉత్పత్తిదారుల అభ్యున్నతి, ముఖ్యంగా మహిళల సాధికారతకు వర్గీస్ కురియన్ అహర్నిశలు శ్రమించారని తెలిపారు. అనంతరం చిత్తూరు జిల్లా కుప్పం మండలం గరిగచ్చినీపల్లెకు చెందిన చంద్రశేఖర్ నాగజ్యోతిని ఉత్తమ మహిళా పాడి రైతుగా ఎంపిక చేశారు. ఆమెను సత్కరించి, రూ.10వేల నగదు, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు బహుమతులు పంపిణీ చేశారు. ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ జేవీ రమణ, డాక్టర్ రవి కుమార్, డాక్టర్ కె. నాగేశ్వరరావు, డాక్టర్ గంగరాజు, డాక్టర్ మంజునాథ పాల్గొన్నారు.
శ్రీసిటీకి ఇద్దరు
ప్రత్యేక అధికారుల
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : తిరుపతిలోని జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి జయంత్ కుమార్‌ను శ్రీసిటీ ఫెసిలిటేషన్ ఆఫీసర్‌గా నియమించారు. అలాగే ఏపీఐఐసీ ప్రాజెక్టు ఇంజనీర్ (సివిల్) సుగుణను శ్రీసిటీ ఐలా అధికారిగా నియమించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మార్గదర్శకాల మేరకు సేవలను అందించడానికి కృషి చేస్తారు. వారి నియామకంపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ‘వన్–స్టాప్ అడ్మినిస్ట్రేషన్’ అమలు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.


