వసతిలేని ప్రవేశం వద్దు!
తిరుపతి సిటీ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్ల్యూ, ఎస్వీ ఆర్ట్స్, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలల్లో సోమవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లకు అనుమతినిస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ టీటీడీ అధికారులు మాత్రం స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించలేమని బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దీనిపై సోమవారం స్పాట్ అడ్మిషన్ల కోసం టీటీడీ డిగ్రీ కళాశాలలకు విచ్చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమలోని పలు జిల్లా నుంచి సుదూర ప్రాంతాల నుంచి స్పాట్ అడ్మిషన్ల కోసం ఎంతో ఆశతో వచ్చామని, కానీ ఇక్కడ అధికారులు కళాశాల సీట్లు మాత్రమే ఇస్తామని, హాస్టల్ వసతి కల్పించలేమని తేల్చి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వసతి కల్పించకపోతే తమకు కళాశాల ప్రవేశాలు అవసరం లేదని వందలాది మంది విద్యార్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
విన్నపాలను పట్టించుకోని టీటీడీ
టీటీడీ విద్యాసంస్థల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే పలు కోర్సులలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడంలో అధికారు లు విఫలమయ్యారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రిన్సిపాళ్లు పలుమార్లు టీటీడీ విద్యాశాఖకు విన్నవించారు. కానీ, ఇప్పటి వరకు హాస్టల్ సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో చాలా మంది విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి చూపడంలేదు. అలాగే కన్వీనర్ కోటాలో సైతం సీట్లు పొందిన వందలాది మంది విద్యార్థులకు హాస్టల్ సీట్లు దక్కకపోవడంతో టీసీలు తీసుకుని వెళ్లిపోయేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. టీటీడీ అధికారులు స్పందించకపోతే కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.


