ఈఎస్‌ఐ స్థలం పరిరక్షణకు డిమాండ్
తిరుపతి తుడా : తిరుపతి రాయలచెరువు రోడ్డు సమీపంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి చెందిన స్థలాన్ని కబ్జాదారుల నుంచి పరిరక్షించాలని వైద్యులు, సిబ్బంది డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ఆక్రమణకు గురైన స్థలం వద్ద నిరసన తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ శ్యామ్‌బాబు మాట్లాడుతూ ఆస్పత్రి ముఖ ద్వారంలో మరో గేటు నిర్మాణానికి చర్యలు చేపట్టిన తరుణంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలం తమదంటూ అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రికి గతంలో సర్వే నంబర్ 246/6, 246/7లో 6.45 ఎకరాలు కేటాయించారని, ప్రస్తుతం ఈ స్థలంలో కార్మిక శాఖ పరిధిలో 100 పడకల ఆస్పత్రి ఉందని వివరించారు. రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాలోని లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి స్థలం కబ్జా కాకుండా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.


