నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ’ నిర్వహించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసినా, వాట్సాప్ నంబరు: 91333 31912తో చాటింగ్ ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని వివరించారు.
చిల్డ్రన్ హోమ్స్‌లో
ఉద్యోగాలకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : మిషన్ వాత్సల్య స్కీమ్‌లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ వసంతబాయి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్, పార్ట్‌టైమ్ ప్రాతిపదికన ఉద్యోగానికి తీసుకుంటామని వెల్లడించారు. ప్రధానంగా కుక్, నైట్‌వాస్‌మెన్, హౌస్ కీపర్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్స్, పీటీ, యోగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అర్హత కల్గిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా నేరుగా స్వీకరిస్తామన్నారు. సోమవారం నుంచి 24 సాయంత్రం 5.30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికై న వారికి రూ.7,944 నుంచి రూ.10 వేల వరకు వేతనం ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 30–45ఏళ్లలోపు వయసు ఉండాలని సూచించారు. కలెక్టర్ నేతృత్వంలో ఎంపిక ఉంటుందని వివరించారు.
19 నుంచి పుట్టపర్తికి
ప్రత్యేక బస్సులు
తిరుపతి అర్బన్ : పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 19 నుంచి 24 వరకు ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డీపీటీఓ జగదీష్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 30 మంది ప్రయాణికులు ఉంటే ఒక ప్రత్యేక బస్సును పంపుతామని చెప్పారు. మార్గం మధ్యలో కదిరి, లేపాక్షి ఆలయాలను సందర్శించుకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


