టీటీడీలో పరాకాష్టకు చేరిన బీఆర్‌ నాయుడి విద్వేషం | - | Sakshi
Sakshi News home page

టీటీడీలో పరాకాష్టకు చేరిన బీఆర్‌ నాయుడి విద్వేషం

Nov 16 2025 7:13 AM | Updated on Nov 16 2025 7:13 AM

టీటీడీలో పరాకాష్టకు చేరిన బీఆర్‌ నాయుడి విద్వేషం

టీటీడీలో పరాకాష్టకు చేరిన బీఆర్‌ నాయుడి విద్వేషం

మా పాలనలో 700మంది వేదపండితుల

నియామకానికి వైఎస్‌ జగన్‌ జీవో జారీ

నేడు బ్రాహ్మణులపై పెచ్చుమీరిన వివక్ష

శ్రీవారి పవిత్రతను, టీటీడీ ప్రతిష్టను నాశనం చేస్తున్న అసమర్థ చైర్మన్‌

వేద పండితుల నియామక కమిటీలో

అవినీతి పరిశీలకులు

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన ఆగ్రహం

తిరుపతి మంగళం : చంద్రబాబు పాలనలో నియమితులైన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడి విద్వేషాలు పరాకాష్టకు చేరాయని, టీటీడీలో బ్రాహ్మణులపై వివక్ష రోజురోజుకూ పెచ్చుమీరుతోందని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. శనివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేదపారాయణ పండితుల నియామకాల కమిటీలో అవినీతిపరులను పరిశీలకులుగా నియమించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

యాభై ఏళ్ల క్రితం కాంచీపుర యతీంద్రులు శ్రీశ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు టీటీడీ ద్వారా ధర్మప్రచారం కొనసాగాలనే మహోపదేశం చేశారు. టీటీడీ దాన్ని ఒక దైవాజ్ఞగా స్వీకరించింది. ఆనాటి ఈవో పీవీఆర్‌కే ప్రసాద్‌, ప్రణాళిక సిద్ధం చేసిన ఉప్పలూరు గణపతి శాస్త్రి ద్వారా శ్రీకారం చుట్టుకున్న వేద పరిరక్షణ పథకం మహోన్నతమైంది. నాటి నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిష్టకు, సనాతన ధర్మ పరిరక్షణ యజ్ఞానికి ఆవు నెయ్యిగా 1,400 మందికి టీటీడీ సంభావన అందజేస్తోంది. టీటీడీ విభాగానికి వేదాధ్యయన సంస్థ అనే ప్రత్యేక ప్రాజెక్టును నెలకొల్పింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఘనాపాటీలు మరింతగా శ్రీవారి పక్షాన వేద విద్యకు వెలుగు దివ్వెలుగా ఉండాలని వారి సంఖ్యను మరింతగా పెంచారు. 700 పోస్టుల భర్తీకి మా ప్రభుత్వ హయాంలో జీవో ద్వారా టీటీడీకి అనుమతించారు. కానీ ఇటీవల టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడులో బ్రాహ్మణ ద్వేషం పరాకాష్టకు చేరింది. వేద విశ్వవిద్యాలయం కులపతి.. ఆచార్య రాణీ సదాశివమూర్తిని ఒక హేయమైన పదజాలంతో దూషించడాన్ని కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని తలా పాపం తలా పిడికెడులా బోర్డు సభ్యుల ద్వారా ఆమోదింపజేసి వారి తొలగింపు ప్రతిపాదనను ప్రభుత్వానికి కూడా పంపారు. వేదాధ్యయన సంస్థ పీవోస్‌ శ్రీపణిగణపతిని దారుణంగా నిందించిన పాపం కూడా బీఆర్‌ నాయుడుదే. కేవలం ఒక్క రూపాయితో ఉద్యోగం చేస్తున్న ఆనంద తీర్థ స్వాముల వారికి మెట్లోత్సవ ప్రారంభానికి ఆహ్వానిస్తే ఆయనను అవమానపరిచిన ఘనత బీఆర్‌ నాయుడుదే. ఒక అర్చత శిరోమణి తనతో మాట్లాడడానికి వస్తే విషంలాగా ద్వేషపూరితమైన మాటలు మాట్లాడిన వ్యక్తి కూడా బీఆర్‌ నాయుడే. ఈరోజు 700 పోస్టులకు ఉన్నత వేదాధ్యయన సంస్థలో నియామక ప్రకటన ఇస్తే మీరు ఉద్దేశపూర్వకంగా వేద విధులకు సంభావన అందించే ప్రక్రియను నిలిపివేసి, నియామక ప్రక్రియను ఒకసారి వాయిదా కూడా వేశారు. ఇందుకోసం గతంలో ఉన్న అత్యంత నీతివంతులను కాదని, మీకు కావాల్సిన వారితో ఈ నియామక కమిటీని నియమించుకున్నారు. మేడసాని మోహన్‌ను అబ్జర్వర్‌గా నియమించుకున్నారు. ఆయన మహా పండితుడే కావచ్చు.. వేద పండితులను నియమించడంలో అజ్జర్వర్‌గా నియమించే అంతటి ఘనాపాటి ఆయన కాదు. మరో అబ్జర్వర్‌గా అవినీతికి పరాకాష్ట అయిన వ్యక్తిని నియమించారు. ఈ నియామకాల్లో మీ దాష్టీకాలను ప్రజలు గమనిస్తున్నారు. మీరు నన్ను కేసుల్లో ఇరికించో, లేక భయపెట్టాలని చూస్తే భయపడే రకం కాదు. మీ అవినీతి పర్వాలను నిరంతరం ఎత్తి చూపుతూనే ఉంటాను.. అని భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement