ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్ : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన విజయ్ కుమార్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6లక్షల జరిమానా విధిస్తూ శనివారం తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జడ్జి నరసింహమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు 2017లో ఎర్రచందనం తరలిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు తుది తీర్పు దశలో ఉండగా కోర్టుకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే నిందితుడిని నాన్ బెయిలబుల్ వారెంట్‌పై అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచారని అప్పటి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విజయ్ కుమార్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి శిక్ష విధించారు.
నగదు లెక్కింపు యంత్రాల బహూకరణ
చంద్రగిరి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు శనివారం నగదు లెక్కించే యంత్రాలను బహూకరించారు. డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌కు బ్యాంకు జోనల్ మేనేజర్ పత్రి శ్రీనివాస కుమార్ అందజేశారు. ఏఈఓ దేవరాజులు, బ్యాంకు రీజనల్ మేనేజర్ సోమాచి శర్మ, మేనేజర్ ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసులపై సమీక్ష
తిరుపతి లీగల్ : స్థానిక ఐదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో అట్రాసిటీ కేసులపై తిరుపతి ఐదో అదనపు జిల్లా జడ్జి, నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి రామ్ గోపాల్ సమీక్ష నిర్వహించారు. అట్రాసిటీ కేసుల్లో పోలీసు అధికారులు దర్యాప్తు ఎలా నిర్వహించాలి, చార్జిషీట్ ఎలా దాఖలు చేయాలి, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తునకు ప్రభుత్వం తగు బడ్జెట్ కేటాయించాలని సూచించారు. డీఎస్పీలు కేఎన్ మూర్తి, రవికుమార్, శ్యామ్‌సుందర్, బీవీ శ్రీనివాసులు, రవీంద్ర పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీకి విరాళంగా పార్థివ దేహం
తిరుపతి తుడా : టీటీడీలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కట్టమంచి కేఎల్ ఇందిర తన భర్త డాక్టర్ శివాజీ పార్థివ దేహాన్ని పద్మావతి మెడికల్ కాలేజ్ అనాటమీ విభాగానికి డొనేషన్ చేసినట్లు స్విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ డాక్టర్ శివాజీ అనేక విద్యాసంస్థలల్లో బోటనీ సీనియర్ ఫ్యాకల్టీగా సేవలందించారని వెల్లడించారు. డైరెక్టర్ డాక్టర్ ఆర్‌వీ కుమార్, వైధ్యాధికారులు డాక్టర్ శివాజీకి నివాళులర్పించారు.
ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు
ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు


