శ్రీసిటీకి భారీగా పెట్టుబడులు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): విశాఖ భాగస్వామ్య సదస్సు–2025లో రెండో రోజు శ్రీసిటీ భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా అయిదు కొత్త పరిశ్రమలను ప్రారంభించారు. 12 కొత్త కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మొత్తంగా రూ.31,450 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. చంద్రబాబు మాట్లాడుతూ శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక నమూనాగా అభివర్ణించారు. ప్రపంచ కనెక్టివిటీని మెరుగుపరచడానికి త్వరలో శ్రీసిటీ సమీపంలో ఎయిర్‌స్ట్రిప్ నిర్మిస్తామన్నారు. శ్రీసిటీ పురోగతిని ప్రశంసిస్తూ, డాక్టర్ సన్నారెడ్డి అంకితభావాన్ని అభినందించారు. సన్నారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో శ్రీసిటీని 50 దేశాలకు నిలయంగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
లారీని ఢీకొని విద్యార్థి మృతి
చంద్రగిరి : లారీని వెనకనుంచి ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై నడింపల్లె వద్ద జరిగింది. వివరాలు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సమీపంలోని ఆనుకూరపల్లె దళితవాడకు చెందిన లక్ష్మీకాంత్(20) తిరుపతిలోని తన చిన్నాన్న ఇంట్లో ఉంటున్నాడు. పాకాల మండలం సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తిరుపతి నుంచి పల్సర్ బైక్‌పై కళాశాలకు చేరుకున్నాడు. పరీక్ష అనంతరం తిరిగి వస్తుండగా ముందు వెళుతున్న లారీ అకస్మాత్తుగా పక్కకు తిరగడంతో ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్రచందనం పట్టివేత : ఇద్దరి అరెస్ట్
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుమల పాపవినాశనం పరిధిలో శనివారం చేపట్టిన తనిఖీల్లో నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తిరుపతి రేంజ్ అటవీక్షేత్రాధికారి బి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. పట్టుబడిన దుంగల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని వెల్లడించారు. నిందితులను తమిళనాడులోని సేలానికి చెందిన అశోక్, రమేష్‌గా గుర్తించామని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో తిరుమల డీఆర్‌ఓ స్వప్నకుమారి, ఎఫ్‌బీఓ అఖిల్ పాల్గొన్నారు.
శ్రీసిటీకి భారీగా పెట్టుబడులు


