● కలెక్టరేట్ వద్ద బాధితుల ఆందోళన
నివాసాల తొలగింపుపై నిరసన
తిరుపతి అర్బన్ : శ్రీకాళహస్తి పట్టణంలో సుమారు 40 ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇళ్లను పురపాలక అధికారులు కూల్చేస్తున్నారని మూడు కుటుంబాలకు చెందిన బాధితులు, తమ బంధుమిత్రులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. బాధితులు జె.రాజేంద్రప్రసాద్, ఆర్‌డీ సంజీవమ్మ, డి.షీరావతి, డి.ప్రశాంత్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. తమ ఇళ్లను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ నోటీసులు జారీ చేశారని, దీనిపై పురపాలక అధికారులను కలిస్తే రూ.లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంత మొత్తం ఇవ్వలేమన్నందుకు జేసీబీలో తమ నివాసాలను కూల్చేందుకు తెగబడ్డారని వాపోయారు. ఈ క్రమంలోనే కలెక్టర్‌కు తమ కష్టాలు విన్నవించేందుకు వచ్చామని తెలిపారు. అయితే ఇంతలోనే వారు పెట్రోల్ సీసాలు తీసుకుని ఆత్మహత్యే తమకు శరణ్యమని నిరసన తెలిపేందుకు యత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు హుటాహుటిన కలెక్టరేట్ వద్దకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.


