తాళం వేసిన ఇళ్లే టార్గెట్
చంద్రగిరి : తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని చంద్రగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఈ మేరకు డీఎస్పీ ప్రసాద్, సీఐ సురేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ధర్మవరానికి చెందిన సమ్మే రామాంజనేయులు అలియాస్ సాయిరాం అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడి జైలుక వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో కొంత కాలం క్రితం తిరుపతికి చెందిన సత్య సారథి, చాట్ల నరేంద్ర పరిచయమయ్యారు. వీరిద్దరూ స్వతహాగా డ్రైవర్లు కావడంతో, ఖాళీ సమయంలో తమ యజమానికి చెందిన స్కూటీపై గ్రామాల్లో రెక్కీ చేపట్టేవారు.అనంతరం ముగ్గురు కలసి ఎవరూ లేని ఇళ్లలోకి చొరబడి బంగారం, వెండి, ఇతర వస్తువులు అపహరించేవారు. ఈ మేరకు అక్టోబర్ 28వ తేదిన రాయలపురంలోని ఓ ఇంటికి కన్నం వేసి 3 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండిని చోరీ చేశారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కేఎంఎం కళాశాల వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. వీరి నుంచి 1,100 గ్రాముల వెండి, 50 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.10వేల నగదును రికవరీ చేశారు. కేసును ఛేదించడంతో కీలకంగా వ్యవహరించిన సీఐ సురేష్ కుమార్, ఎస్‌ఐలు రవీంద్ర, అనిత, మంజుల, మురళీ మోహన్‌తో పాటు సిబ్బందికి ఎస్పీ సుబ్బరాయుడు రివార్డులను ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు.


