జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా శ్రీసిటీ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): భారత్–జపాన్ పారిశ్రామిక బంధం మరింత బలపడుతోందని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించిన 30వ సీఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో భాగంగా జరిగిన ‘భారత్–జపాన్ భాగస్వామ్యం’ సెషన్స్‌లో ఆయన ప్యానెలిస్ట్‌గా పాల్గొన్నారు. సన్నారెడ్డి మాట్లాడుతూ జపాన్ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిందన్నారు. మన దేశంలో రెండో అతిపెద్ద జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా శ్రీసిటీ ఎదిగిందని వెల్లడించారు. 300 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జపాన్ ఎన్‌క్లేవ్‌లో 35 కంపెనీలకు పైగా పనిచేస్తున్నాయని వివరించారు. అలాగే, శ్రీసిటీలోని జపాన్–ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ (జేఐఎం) నైపుణ్య కేంద్రం శిక్షణ ద్వారా స్థానిక యువతను జపనీస్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేస్తున్నారని వెల్లడించారు.
ప్రత్యేక ఆకర్షణగా శ్రీసిటీ స్టాల్
సదస్సులో ఏర్పాటు చేసిన శ్రీసిటీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకర్షణీయ డిజిటల్ ప్రదర్శనలు, 3డీ మోడళ్లతో పలువురిని ఆకట్టుకుంది. సందర్శించిన దౌత్యవేత్తలు, మంత్రులు, పరిశ్రమల ప్రతినిధులు శ్రీసిటీ విలక్షణమైన సమగ్ర అభివృద్ధి నమూనాను ప్రశంసించారు.


