సతీష్‌కుమార్‌కు చిత్తూరు ఏఆర్‌తో అనుబంధం
చిత్తూరు అర్బన్: టీటీడీ పరకామణి కేసులోని కీలక అధికారి సతీష్‌కుమార్ మృతితో చిత్తూరు పోలీసుశాఖలో ఆర్ముడు రిజర్వు (ఏఆర్) విభాగంలోని పలువురు సీనియర్లకు మాట రావడంలేదు. అసలు సతీష్ కుమార్ చనిపోయింది వాస్తవమేనా..? అంటూ స్నేహితులకు ఫోన్లు చేసి కనుక్కుంటూ.. తీరా ఆయన మరణ వార్త తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం సతీష్ కుమార్ చిత్తూరు ఏఆర్ విభాగంలో విధుల్లోకి చేరారు. ఎస్‌ఐ పోస్టు సాధించిన తరువాత సతీష్‌కుమార్‌కు చిత్తూరు ఏఆర్‌లో తొలి పోస్టింగ్ లభించింది. దాదాపు రెండున్నరేళ్లకు పైగా ఆయన చిత్తూరులో ఆర్‌ఎస్‌ఐగా పనిచేశారు. పీఎస్‌ఓలకు ఇన్‌చార్జ్‌గా, స్పెషల్ పార్టీకి పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వర్తించారు. సహచరులతో ఎప్పుడూ చలాకీగా, చనువుగా ఉండడం సతీష్‌కుమార్ నైజం. చిత్తూరులో తొలి పోస్టింగ్ లభించడంతో ఇక్కడి పోలీసుశాఖలోని వందలాది మంది ఏఆర్ సిబ్బంది సోషల్‌మీడియాలో సతీష్ కుమార్ మృతికి సంతాపం ప్రకటించారు.


