ఎస్వీయూలో మళ్లీ ర్యాగింగ్
ఇంటరాక్షన్ పేరుతో వేధించిన సీనియర్లు భయం గుప్పిట్లో జూనియర్ విద్యార్థులు ఇంజినీరింగ్ హాస్టల్‌లో అర్ధరాత్రి వికృత చేష్టలు మండిపడుతున్న విద్యార్థి సంఘాలు
రాయలసీమకే తలమానికమైన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విష సంస్కృతి వేళ్లూనుకుంటోంది. ఇన్నేళ్లుగా నిద్రాణమైన ర్యాగింగ్ భూతం విశృంఖలంగా కోరులు చాస్తోంది. ఇటీవల సైకాలజీ విభాగంలో జరిగిన ఘటనను మరువక ముందే మళ్లీ గురువారం రాత్రి వికృత చేష్టలతో పడగ విప్పింది. ఈ పర్యాయం ఇంజినీరింగ్ హాస్టల్‌లోని విశ్వతేజ బ్లాక్ ర్యాగింగ్ దుశ్చర్యకు వేదికై ంది. ఇంటరాక్షన్ పేరుతో జూనియర్ విద్యార్థులను సీనియర్లు తీవ్రంగా వేధించిన ఘటన కలకలం రేపుతోంది.
తిరుపతి సిటీ : ఎస్వీయూలో విధ్యార్థులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పేరుతో సీనియర్లు విరుచుకుపడుతున్నారు. ఇటు కళాశాలలో.. అటు వసతి గృహాలలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో జూనియర్లు బిక్కుబిక్కుమంటూ బతుకుతుకున్నారు. ఇంతటి దారుణాలు జరుగుతున్నప్పటికీ వర్సిటీ అధికారులు కనీసం స్పందించడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చేదు జ్ఞాపకం చెరగక ముందే..
ఎస్వీయూ సైకాలజీ విభాగంలో ఇటీవల సాక్షాత్తు ఆ విభాగాధిపతి జూనియర్లపై ర్యాగింగ్ చేయాలంటూ సీనియర్లు ప్రొత్సహించిన ఘటన వర్సిటీలో అలజడి రేపింది. దీంతో ర్యాగింగ్‌కు గురైన విద్యార్థినుల్లో నలుగురు ఏకంగా టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. అయినప్పటికీ వర్సిటీ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులిపేసుకున్నారు. ఈ చేదు జ్ఞాపకం నుంచి విద్యార్థులు తేరుకోక ముందే వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలల వసతి గృహంలో ర్యాగింగ్ కొనసాగింది.
జూనియర్లకు టార్చర్
ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ విశ్వతేజ బ్లాక్‌లో ఈ ఏడాది బీటెక్ కోర్సులో అడ్మిషన్లు పొందిన జూనియర్ విద్యార్థులు గురువారం అర్ధరాత్రి నరకయాతన అనుభవించారు. ఇంటరాక్షన్ తరగతుల పేరుతో జూనియర్లను ఫార్మల్ డ్రస్సులు ధరించి రావాలని సీనియర్లు ఆదేశించారు. అనంతరం వారిని క్రమపద్దతిలో కూర్చోబెట్టి పలు రకాలు వికృత చేష్టలతో మానసికంగా వేధించారు. దీనిపై బాధితులు విద్యార్థి సంఘాలకు మొరపెట్టుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగాయి. కానీ, హాస్టల్, వర్సిటీ అధికారులు పట్టించుకోలేదని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
ఎస్పీ అవగాహన కల్పించినా..
ఎస్వీయూలో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు వర్సిటీ అధికారులు రెండు రోజుల క్రితం ఎస్పీని ఆహ్వానించారు. యాంటీ ర్యాగింగ్‌పై శ్రీనివాసా ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ర్యాగింగ్ పర్యవసానాలు, శిక్షలు, కేసులపై విద్యార్థులకు అవగాహన కల్పించి హెచ్చరించారు. అయితే, సీనియర్లు, వారికి సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు మాత్రం వర్సిటీలో ర్యాగింగ్ ప్రక్రియను కొనసాగిస్తూ జూనియర్లకు నరకం చూపిస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి
ఎస్వీయూలో ర్యాగింగ్ నివారణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాయలసీమ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఈ మేరకు రెక్టార్ సీహెచ్ అప్పారావుకు వినతిపత్రం సమర్పించారు. తక్షణం వర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఎస్వీయూలో మళ్లీ ర్యాగింగ్
ఎస్వీయూలో మళ్లీ ర్యాగింగ్


