రాళ్లమయం!
స్వర్ణముఖిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు రెచ్చిపోతున్న ఇసుకాసురులు అడుగంటి పోతున్న భూగర్భ జలాలు నిర్వీర్యమవుతున్న నీటి పథకాలు పట్టించుకోని అధికారులు ఆందోళన చెందుతున్న ప్రజలు
ఇసుక మాయం..
నాయుడుపేటటౌన్ : ఇసుకాసురుల ధన దాహానికి స్వర్ణముఖి ధ్వంసమవుతోంది. కూటమి నేతల అండదండలతో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ప్రధానంగా స్వర్ణముఖి నది కాజ్‌వే నుంచి మున్సిపల్ అధికారులు ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపునకు పెట్టిన గేటు ద్వారా పట్టపగలే అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇందుకోసం అక్రమార్కులు ఏకంగా అధికారులు ఏర్పాటు చేసిన గేట్లనే తొలగించేయడం గమనార్హం. పోలీసు, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో మరింతగా రెచ్చిపోతున్నారు.
దెబ్బతింటున్న నీటి వనరులు
స్వర్ణముఖిలో లోతుగా ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నారు. నదీతీరంలోని సాగునీటి బోర్లు ఎండిపోతున్నాయి. అలాగే నాయుడుపేట వాసుల తాగునీటి అవసరాలు తీర్చే పురపాలక నీటి పథకాలు నిర్వీర్యమవుతున్నాయి. నదిలో మున్సిపాలిటీకి చెందిన 11 బోర్లు చుక్కనీరు రాక నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు స్వర్ణముఖిలో కేవలం రెండు నుంచి మూడు అడుగుల్లోనే నీరు ఉబికి వచ్చేది. అలాంటిది ఇప్పుడు పది అడుగుల మేర తవ్వినా నీటి జాడే కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంతలతో ప్రాణాపాయం
నదిలో ఇసుక తవ్వకాల కారణంగా ఏర్పడి భారీ గుంతలతో ప్రమాదం పొంచి ఉన్నట్లే అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తిరుపతి రూరల్‌లో ఇదే విధంగా స్వర్ణముఖిలోని గుంతల్లో పడి ఏడుగురు బాలురు మృత్యువాత పడిన ఘటనను గుర్తు చేస్తున్నారు. నదిలోని గుంతల్లో వర్షాలు కురిసినప్పుడు బురద చేరుతుందని, ఎవరైనా అందులో పడితే ప్రాణాపాయం తప్పదని వివరిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఇష్టారాజ్యంగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి అడ్డుకోవాలని కోరుతున్నారు. లేకుంటే ఇప్పటికే రూపురేఖలు కోల్పోయిన స్వర్ణముఖి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు.
స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు
స్వర్ణముఖి నది నుంచి పగటిపూట ట్రాక్టర్లు, రాత్రివేళ టిప్పర్లతో ఇసుక స్మగ్లింగ్‌ను నిరాటంకంగా సాగిస్తున్నారు. భారీ యంత్రాలను వినియోగించి దాదాపు 9 అడుగుల లోతు వరకు నదిలో తవ్వకాలు చేపడుతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు సైతం తెగబడుతున్నారు. అడ్డుకోవాలని చూసిన అధికారులను మామూళ్ల మత్తులో జోకొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇసుక లోడ్‌లతో అతి వేగంగా వెళ్లే టిప్పర్ల కారణంగా నాయుడుపేట, సమీప ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. రోడ్లు దెబ్బతింటుండడంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.


