పోలీస్ సహకారంతో సై‘ఖతం’!
దొరవారిసత్రం : మండలంలోని వేటగిరిపాళెంలో ఇసుకాసురులకు పోలీసులే అండగా నిలుస్తున్నారు. కూటమి నేతల అండతో కాళంగి నదిని తవ్వేస్తున్న అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. వివరాలు.. సూళ్లూరుపేట ప్రాంతానికి ఓ నేత కన్ను కాళంగి నదిపై పడింది. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను తవ్వేసి తరలించేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేటగిరిపాళెం వాసులు తమ గ్రామం మీదుగా వెళుతున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్నారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామస్తులను భయపెట్టి ట్రాక్టర్లను అక్కడ నుంచి పంపేశారు. దీనిపై ప్రశ్నించిన స్థానికులను కేసులు పెడతామని బెదిరించారు. ఇసుక రవాణాకు అడ్డుపడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇసుకాసురులను అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి అండగా నిలుస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి, అక్రమార్కులతోపాటు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పోలీస్ సహకారంతో సై‘ఖతం’!


