వంతెనకు తప్పని ప్రమాదం
స్వర్ణముఖిపై ఎల్‌ఏ సాగరం బీడీ కాలనీ, తుమ్మూరు వద్ద రైలు, వాహనాలు వెళ్లేందుకు రెండు వంతెనలు ఉన్నాయి. ఆ బ్రిడ్జిల వద్ద సైతం అక్రమార్కులు లోతుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో వంతెనల పరిస్థితి సైతం ప్రమాదంలో పడింది. ఇదే విధంగా మరికొంతకాలం వంతెనల వద్ద తవ్వకాలు సాగితే పెనుముప్పు వాటిల్లే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భీమవరం, తిమ్మాజికండ్రిగ, మూర్తి రెడ్డిపాళెం, అయ్యప్పరెడ్డి పాళెం, కల్లిపేడు, మర్లపల్లె, అన్నమేడు, వెముగుంట పాళెం తదితర ప్రాంతాల్లో కూడా ఇసుక తవ్వకాలు నిరంతరాయంగా సాగుతున్నాయని వెల్లడిస్తున్నారు. ఒకప్పుడు ఎటు చూసినా ఇసుక తిన్నెలతో కళకళలాడిన స్వర్ణముఖి నది.. ఇప్పుడు రాళ్లు తేలి దారుణంగా తయారైందని మండిపడుతున్నారు.


