అల్లకల్లోలం
వాకాడు: రెండు రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా మండలంలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురువడంతోపాటు చలిగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం అనూహ్య మార్పుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసి పడుతున్నాయి. అలాగే బంగాళాఖాతం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కరుస్తోంది. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్రంలో అలలు దాదాపు 5 నుంచి 7మీటర్ల ఎత్తుకు భీకరమైన శబ్దాలతో ఎగసి పడుతున్నాయి. దీంతో సముద్ర తీరం దాదాపు 50 మీటర్లు వరకు ముందుకు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తీరంలో వర్షంతోపాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా పగలు సైతం రాత్రిని తలపిస్తోంది. దీంతో తీరానికి వచ్చే పర్యాటకులు భయంతో వెనుతిరిగి వెళుతున్నారు. సముద్రంలో భిన్న మార్పులు చోటు చేసుకోవడంతో ముందుగా పసిగట్టిన ఉదయాన్నే వేటకు వెళ్లిన మత్స్యకారులు హుటా హుటీన ఖాళీ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు ఎవరూ వేటకు వెళ్లకూడదని మత్స్యకార పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది.
ఒడ్డుకు చేరుకుంటున్న మత్స్యకారుల బోట్లు
అల్లకల్లోలం


