అన్ని రంగాల్లో రాణించాలి
తిరుపతి అర్బన్: ప్రతి వ్యక్తికీ విభిన్న అంశాల్లో ప్రతిభ ఉండాలని, అన్ని రంగాల్లోనూ రాణించేలా ముందుకు సాగితేనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు అనంతపురంలో జరిగిన 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగులు సత్తా చాటారు. ఈ క్రమంలో గురువారం విజేతలను కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్కరించారు. జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లు జయరాజ్ (కలెక్టరేట్ సివిల్ సఫ్లైస్ డీటీ), సురేంద్ర (చంద్రగిరి సివిల్ సఫ్లైస్ డీటీ) క్యారమ్స్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి పతకాలను సాధించారు. అలాగే పుత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న మాధవి మ్యూజికల్ చైర్స్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచి, పతకాన్ని సాధించారు. పతకాలు సాధించిన ఈ ముగ్గురు అధికారులను కలెక్టర్ శాలువలతో సత్కరించారు. డీఆర్వో నరసింహాలు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి అశోక్‌రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ గోపినాద్‌రెడ్డి, జిల్లా కోశాధికారి రూప్ చంద్, క్రీడా సాంస్కృతిక సెక్రటరీ దిలీప్, భాస్కర్ పాల్గొన్నారు.


