పాతెయ్ జెండా
జిల్లాలో ప్రజాప్రతినిధులు, నాయకుల అండ ఉంటే చాలు.. ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా జెండా పాతేయెచ్చు. అధికారులన్నారనే కదా మీ అనుమానం. ఇదంతా మాకు షరామామూలే.. అంటూ యంత్రాంగం కళ్లప్పగించి చూస్తుండడంతో అక్రమార్కుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఖాళీ స్థలాలే కాదు.. కొండలు, గుట్టలు, చివరకు చెరువులనూ వదలడం లేదు. అడిగినప్పుడు చూసుకుందాంలే అన్న ధోరణిలో బరితెగిస్తున్నారు.
నాయకుల అండ..
జాతీయ రహదారి నుంచి ముత్యాలపాడు చెరువు, ఏపీఐఐసీ భూముల్లో వేస్తున్న 60 అడుగుల రోడ్డు
సాక్షి టాస్క్ పోర్సు: చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తరువాత గూడూరు నియోజకవర్గంలో భూములకు రెక్కలు రావడంతో ఎవరికి వారు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని, విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధి పూర్తిస్థాయిలో అండదండలు పుష్కలంగా లభిస్తుండడంతో అధికారులు కూడా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా మిన్నకుండిపోతున్నారు. స్థానికులు జిల్లాస్థాయి అధికారులకు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఫిర్యాదులు చేస్తే, దానికి సంబంధించిన రికార్డుల్లో పట్టా భూమిగా ఉందని స్థానిక అధికారులు జిల్లా అధికారులను పక్క దారి పట్టిస్తున్నారు. ఇందులో ఏదైనా ఇబ్బంది ఎదురైతే స్థానిక ప్రజా ప్రతినిధి జిల్లా అధికారులతో చర్చించి సర్దుబాటు చేస్తున్నారు. దీంతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా, జిల్లాస్థాయి అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గంలోని 16వ నంబర్ జాతీయ రహదారికిరువైపులా ఉన్న భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతుండగా వీటికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగంగా పుంజుకుంది. ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టే వ్యాపారం చేసే సంస్థలు కూడా ఈ ప్రాంతంలో వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధం అవుతూ రహదారి పక్కను పట్టా భూమిని కొనుగోలు చేసి, దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా అందులో కలిపేసుకుంటున్నాయి. ఇందుకు స్థానిక ప్రజా ప్రతినిధి పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పండుగగా మారుతుంది. ఈ క్రమంలోనే చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లికి చెందిన రైతులకు కడివేడు రెవెన్యూ పరిధిలో ముత్యాలపాడు చెరువుకు సమీపంలో సుమారు 40 ఎకరాల పట్టా భూమి ఉండగా దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్‌ను అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. అయితే రియల్ ఎస్టేట్‌కు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో రహదారి లేకపోవడంతో ప్రత్యామ్నా మార్గం ఆలోచించి, స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా దారి ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. దీంతో ఆయన సలహాల మేరకు ముత్యాలపాడు పంచాయతీకి చెందిన నాయకుడి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా జాతీయ రహదారికి అనుకుని ఉన్న సర్వే నంబర్ 41లోని ఏపీఐఐసీ భూములతోపాటు ముత్యాలపాడు చెరువు భూమి రెండు ఎకరాలకు పైగా ఆక్రమించి, 60 అడుగుల రోడ్డు నిర్మిస్తున్నారు. ఒక వైపు ముత్యాలపాడు చెరువు ఆయకట్ట కింద ఉన్న రైతులు ఇలా లోతట్టులోని భూములు ఆక్రమణలకు గురి అవుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా కనీసం నీటి పారుదల శాఖ అధికారులు కూడా అటు వైపు కన్నెతి చూడడం లేదు. ఏపీఐఐసీకి చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నా ఆ శాఖకు చెందిన అధికారులు కనీసం అటు వైపు రాకుండా ఉండడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు మాత్రం రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన వాటిని నేరుగా తీసుకుని వెళ్లేందుకు జాతీయ రహదారి నుంచి తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ డీఈఈ ఆనందబాబును వివరణ కోరగా చెరువులో రహదారి నిర్మాణం చేపడుతున్నారనే విషయం ఇప్పటివరకు తన దృష్టి రాలేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.


