నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యం
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు విధులు నిర్వహించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ కోరారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో గురువారం సంస్థ పరిధిలో పనిచేసే చీఫ్ ఇంజినీర్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి వరకు హాజరైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు అధికారులు, సిబ్బంది మెరుగైన, సత్వర సేవలు అందించాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలపై సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ స్థాయిల్లో సంబంధిత అధికారులు నిరంతరం సమీక్షిస్తూ, వాటిని పూర్తిస్థాయిలో నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగ దారుల సేవల్లో అలసత్వాన్ని ప్రదర్శించవద్దని హెచ్చరించారు. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో సిబ్బంది అందిస్తున్న సేవలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ తరహా ఫిర్యాదులను తగ్గించేందుకు సిబ్బంది వినియోగ దారులకు మరింత మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె.గురవయ్య, కె.రామ్మోహన రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, పి. హెచ్.జానకీరామ్, కె. ఆదిశేషయ్య, ఎన్. శోభా వాలెంటీనా, ఎం. ఉమాపతి, ఎం. మురళీ కుమార్, పి. సురేంద్ర నాయుడు, జనరల్ మేనేజర్లు రామచంద్ర రావు, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, సురేంద్ర రావు, మురళీధర్, రాజశేఖర్ రెడ్డి, విజయన్, చక్రపాణి, భాస్కర్ రెడ్డి, మోజెస్, శ్రీనివాసులు, జగదీష్, ఎస్‌ఈలు రమణ, తిరుమల రావు, ఇస్మాయిల్ అహ్మద్, శేషాద్రి శేఖర్, ప్రదీప్ కుమార్, సంపత్ కుమార్, సుధాకర్, రాఘవేంద్ర, చంద్రశేఖర్ రావు, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వార్షిక సదస్సు
ఏర్పేడు: బెంగుళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 91వ వార్షిక సదస్సు తిరుపతి ఐసర్ కొలీజియం(ఆడిటోరియం)లో శుక్రవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు జరగనున్నట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ తెలిపారు. ఐసర్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీ, తిరుపతి ఐఐటీ, తిరుపతి నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ లేబొరేటరీ సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 150 మంది శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొని, తమ పరిశోధనల ఫలితాలు, ఆలోచలను పంచుకుంటారన్నారు. బెంగుళూరు ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ అధ్యక్షోపన్యాసం చేస్తారన్నారు. ఈ సమావేశంలో ఎన్‌ఏఆర్‌ఎల్ డైరెక్టర్ డాక్టర్ అమిత్‌కుమార్ పట్రా, తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టాటా నరసింగారావు, ఐఐటీ ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల, ఐసర్ రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్‌సింగ్ కోహ్లీ, అకడమిక్ డీన్ సుదీప్త దత్తా పాల్గొన్నారు.
నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యం


