గుక్కెడు నీటికి కడివెడు కష్టం
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలంలోని తుమ్మచేనుపల్లిలో తాగునీటి సమస్య నెలకొంది. వర్షాకాలంలోనూ గుక్కెడు నీరు దొరకడం గగనమైంది. నీటి కోసం మహిళలు ఉదయం పూట బిందెలు తీసుకుని పొలాల్లోని బావుల వైపు వెళుతున్నారు. రెండు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పొలాల్లోని బావుల వద్ద వేచి ఉండి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలను బడికి పంపాల్సిన సమయంలో ఉదయం పూట పనులు మానుకుని నీటి కోసం తిప్పలు పడుతున్నారు. గ్రామంలో ఉన్న పాత బోర్లు పాడైపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతు చేయకపోవడం, కొత్త బోర్లు తవ్వకంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. నీటి విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి ఎటువంటి స్పందన లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరతతో చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శిని గ్రామస్తులు నిలదీయడంతో ఆయన సమాధానం చెప్పలేక వెళ్లిపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


