15న ఎస్వీయూలో జాబ్‌మేళా
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లో ఈనెల 15వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఎస్వీయూలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
దేశీయ గోవుల అభివృద్ధే లక్ష్యం
దొరవారిసత్రం : రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎం) కింద దేశీయ గోవు జాతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పశుసంవర్థకశాఖ డీడీ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం డీవీసత్రం మండలం పాళెంపాడులో నిర్వహించిన పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరంలో ఆయన మాట్లాడారు. ఆర్‌జీఎంలో భాగంగా మేలుజాతి పశువుల అభివృద్ధితోపాటు పాల ఉత్పత్తి, పశుగ్రాసం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏడీలు మునిరాజా, గోవర్ధన్, ధనంజయులు, పశు వైద్యాధికారి శ్రీదేవి పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 67,367 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,369 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.30 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
ముక్కంటి హుండీ లెక్కింపు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని ప్రధాన హుండీతోపాటు పరివార దేవతల వద్ద హుండీలను బుధవారం లెక్కించారు. అక్టోబర్ 8వ తేదీ నుంచి హుండీ ద్వారా ఆలయానికి రూ.2,20,13,724 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 59.100 గ్రాముల బంగారం, 599 కిలోల వెండి, 132 విదేశీ కరెన్సీ సమకూరినట్లు వివరించారు.
19న స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్‌లో ఫార్మసీ డిప్లొ మా కోర్సులో ప్రవేశానికి నవంబర్ 19న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బుధవారం తెలిపారు. ఈ నెల14 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులు సర్టిఫికెట్ల ఒరిజినల్‌తో సహా 3సెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా 19న హాజరు కావాల్సి ఉంటుందన్నారు. కోర్సులకు నిర్ణీత ఫీజుతో విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 92990 08151, 92475 75386, 89789 93810ను సంప్రదించాలని సూచించారు.
ఎస్వీ పాలిటెక్నిక్‌లో...
తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డీ ఫార్మసీ కోర్సుకు ఈ నెల 19న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ద్వారకనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, 19న ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలియజేశారు. ఫీజు రూ.6,300 చెల్లించాలని పేర్కొన్నారు. వివరాలకు 99667 61446, 9550 69007, 99088 57585 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
15న ఎస్వీయూలో జాబ్‌మేళా


