ఈకేవైసీ!
పథకాలు.. రాయితీలకు ఈకేవైసీని
తప్పనిసరి చేసిన ప్రభుత్వం
ప్రజలకు అవగాహన కల్పించని అధికారులు
తీవ్రంగా నష్టపోతున్న లబ్దిదారులు
ఇదే మెలికతో 57,096 మంది రైతులకు అందని ‘సుఖీభవ’
ఉపాధి పనుల్లేవ్.. రేషన్ బియ్యం లేదు
పొదుపు రుణాలు రావు..
తల్లికి వందనం రాలేదు
బాబోయ్..
తిరుపతి అర్బన్ : చిన్నపనే అయితే సంబంధిత విభాగానికి వెళ్లి చేయించుకోవాల్సి ఉంటుంది...అందుకు అధికారులు పూర్తిగా సహకారం అందించాలి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈకేవైసీ అంటూ పథకాలకు, రాయితీలపై ముడిపెట్టింది. దీనిపై అవగాహన లేక పెద్దసంఖ్యలో లబ్ధిదారులు పథకాలకు దూరమవుతున్నారు. అలాగే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో పెద్ద పథకాల లబ్ధిదారుల జాబితా నుంచి సైతం అర్హులైన వారు తొలగింపునకు గురై లబోదిబోమంటున్నారు. ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈకేవైసీ)ని చంద్రబాబు ప్రభుత్వం అన్నింటికీ తప్పనిసరి చేసేంది. దీంతో చాలా మంది లబ్ధిదారులు సంక్షేమ పథకాలు, రాయితీలను పొందలేదకపోతున్నారు.
గ్యాస్ రాయితీ అంతే..
ఎన్నికల్లో చంద్రబాబు ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి మూడు సిలెండర్లకు మాత్రమే రాయితీ ఉంటుందని మెలిక పెట్టారు. జిల్లాలో 5.6 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇందులో 25 శాతం మందికి రాయితీతో ఇచ్చే 3 సిలెండర్లు అందలేదు. ఎందుకు ఇవ్వలేదని వినియోగదారులు ప్రశ్నిస్తే ఈకేవైసీ చేయకపోవడంతో అందలేదని చెబుతున్నారు. ఏటా గ్యాస్ సెంటర్లలో ఈకేవైసీ చేయించుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు.
కూలీల అవస్థలు
చంద్రబాబు పాలనలో జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో అందరి చూపు ఉపాధి పథకం వైపు మళ్లింది. జిల్లా వ్యాప్తంగా 11.50 లక్షల మందికి పైగా జాబ్ కార్డులు ఉన్నాయి. వారంతా రోజు వారీ కూలి పనులు చేసుకుంటూ వచ్చే డబ్బులతో జీవనం గడుపుతున్నారు. అయితే కూలీ నగదు సక్రమంగా రావడం లేదు. మరోవైపు ఈకేవైసీ లేదంటూ జిల్లాలో 20శాతం మందికి పనులు కట్ చేశారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో మస్టర్లు ఉండేవి...తాజాగా ఆన్‌లైన్ నేపథ్యంలో ఈకేవైసీ తప్పనిసరిగా మారింది.
బ్యాంకు లావాదేవీలకు సైతం..
బ్యాంకు లావాదేవీలన్నింటికీ ఈకేవైసీ తప్పనిసరిగా మారింది. ఆధార్‌కార్డును బ్యాంకు పాస్ పుస్తకానికి లింక్ చేసుకోవడానికి ఈకేవైసీ ఉండాల్సిందే. అలా చేసుకోకపోవడంతో చాలా మంది తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. ఇప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తమ పిల్లలకు పథకం అందలేదని కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు ఇస్తున్నారు. అలాగే సామాజిక భద్రతా పింఛన్ల విషయంలోనూ ఈకేవైసీ తప్పనిసరి, అంతేకాదు పొదుపు సంఘాల సభ్యులు సైతం రుణాలు పొందడానికి ఈకేవైసీ ఉండాల్సిందే. అయితే లబ్ధిదారులకు ఈకేవైసీ ఉంటేనే పథకాలు, రాయితీలు వస్తాయనే అంశాన్ని పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన సర్కారు ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతుయి. దీంతో అర్హత ఉన్నా అనేక పథకాలకు పేద కుటుంబాలకు చెందిన ఎందరో దూరమవుతున్నారు. ఆ తర్వాత కార్యాలయాల చుట్టూ పదే పదే తిరుగుతున్నా ప్రయోజనం చేకూరడం లేదని పలువురు వాపోతున్నారు.
అన్నదాతల ఆవేదన
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయంగా వైఎస్సార్ రైతు భరోసా పేరుతో జిల్లాలోని 2 లక్షల మందికి పైగా రైతులకు ఏటా క్రమం తప్పకుండా నగదు అందించింది. చంద్రబాబు ప్రభుత్వం అదే పథకాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఇస్తామని చెప్పింది. అయితే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకుంటేనే పథకం వర్తిస్తుందని మెలిక పెట్టింది. దీంతో జిల్లాలోని 2,12,004 మంది రైతులు సుఖీభవ పథకానికి అర్హులైతే, కేవలం 1,54,908 మందికి మాత్రమే నగదు జమ చేసింది. 57,096 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదని సుఖీభవ నగదు జమ చేయకుండా మొండిచేయి చూపింది. దీనిపై ఇటీవల కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రత్యేకంగా అగ్రికల్చర్ అధికారులతో సమావేశమై 100 శాతం మంది రైతులకు ఈకేవైసీ చేయించాలని ఆదేశించాల్సి వచ్చింది.
రేషన్ అందక ఇక్కట్లు
జిల్లాలో 6.05 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ పాలనలో బియ్యం, చక్కెర, కందిపప్పు, నూనెతోపాటు 12 రకాల సరుకులు ఇచ్చేవారు. చిరుధాన్యాలు సైతం ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే చంద్రబాబు పాలనలో బియ్యంతో మాత్రమే సరిపెట్టేస్తున్నారు. కందిపప్పు ఊసేలేదు. అరకొరగా చక్కెర అందిస్తున్నారు. అయితే ముందుగా ఈకేవైసీ చేయించుకోలేదని 15శాతం మందికి ఇచ్చే బియ్యం కూడా నిలిపేశారు.


