యూనియన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం
చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం తిరుచానూరులోని శిల్పారామం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వినియోగదారులు, విరమణ పొందిన ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోనల్ హెడ్ జనరల్ మేనేజర్ పత్రి శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ, బ్యాంక్ వారసత్వాన్ని ప్రస్తావించారు. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన ఈ సంస్థ, సమగ్ర అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ.22.10 లక్షల కోట్లు దాటిందని, దేశంలోని ఐదవ అతిపెద్ద బ్యాంక్‌గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదిగిందని తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్‌కు 8,655 శాఖలు, 9,064 ఏటీఎంలు, 74,200 మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ఏప్రిల్ 2025లో ఏర్పడిన తిరుపతి జోన్, తొమ్మిది జిల్లాల్లోని 310 శాఖలను కలిగి ఉందని, పలు పనితీరు ప్రమాణాలలో జాతీయ స్థాయిలో అగ్రస్థానం సాధించిందని ఆయన గర్వంగా తెలియజేశారు. ‘బ్యాంక్ యూనియన్ ఈ–బిజ్’ బిజినెస్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ప్రారంభించింది. అదేవిధంగా 51 కొత్త శాఖలు, కార్యాలయాలను (వర్చువల్‌గా) ప్రారంభించింది. బ్యాంక్ ఉద్యోగులు రూ.21.68 కోట్లు జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందించారు.


