ప్రవేశానికి పడిగాపులు!
తిరుపతి సిటీ : ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని వందలామంది విద్యార్థులు మూడు వారాలుగా సతమతమవుతున్నారు. ఓఏఎమ్‌డీసీ ద్వారా ఇప్పటికే డిగ్రీలో ప్రవేశానికి మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలిన సీట్లను భర్తీ చేసే దిశగా స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇవ్వడంలో ఉన్నత విద్యామండలి మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రధానంగా తిరుపతి నగరంలో టీటీడీ నిర్వహిస్తున్న పద్మావతి, ఎస్వీ, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. తక్షణం స్పాట్ అడ్మిషన్లకు టీటీడీ విద్యాసంస్థలలో అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.
‘వసతి’కి తప్పని నిరీక్షణ
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న డిగ్రీ కళాశాలల్లో సీట్లు పొంది హాస్టల్ వసతి కోసం వందలాది మంది విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న సీట్లు ఇప్పటికే పూర్తిగా భర్తీ అయ్యాయని, టీటీడీ అధికారులు వసతిని పెంచితేగాని తాము సీట్లు కేటాయించలేమని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు తెగేసి చెబుతున్నారు. హాస్టల్ సీట్లను ఒక్కో కళాశాలలకు సుమారు 200 వరకు పెంచాలని ఇప్పటికే టీటీడీ అధికారులకు విన్నవించినట్లు వెల్లడిస్తున్నారు. అయితే టీటీడీ మాత్రం ఈ విషయంపై దృష్టి సారించకపోవడ దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే టీసీలు తీసుకుని వెళ్లిపోకతప్పదని వాపోతున్నారు.


