రేపటి నుంచి పంచగవ్య వైద్య సమ్మేళనం
తిరుపతి కల్చరల్ : గోమాత సంరక్షణ, సర్వ మానవాళి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మహతి ఆడిటోరియంలో పంచగవ్య వైద్య మహాసమ్మేళనం నిర్వహించనున్నట్లు గవ్య సిద్ధాచార్య నిరంజన్ వర్మ తెలిపారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఈ మేరకు మహా సమ్మేళనం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమ్మేళనానికి దేశ నలుమూలల నుంచి పంచగవ్య వైద్య శాస్త్ర వేత్తలు, గవ్య ఉత్పత్తి నిర్వాహకులు, గోశాల నిర్వాహకులు, గో రక్షరకులు సుమారు 1,200 మంది హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు గోవిజ్ఞానానికి సంబంధించి పరిశోధనా పత్రాలు సమర్పించనున్నట్లు వివరించారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉపన్యాసాలు ఉంటాయన్నారు. ఇందులో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాంకేతిక అధ్యయన అంశాలు ఉంటాయని చెప్పారు. ప్రతి రోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అలాగే పంచగవ్య వైద్య శాస్త్ర విద్యను పూర్తి చేసిన 201 మంది విద్యార్థులకు ‘అడ్వాన్స్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరఫీ’ సర్టిఫికెట్లు అందించనున్నట్లు వెల్లడించారు. పంచగవ్య వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ‘విద్యావారధి’ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో బాలకృష్ణ స్వామి, ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొన్నారు.


