‘ఆహార భద్రత’ను అతిక్రమిస్తే చర్యలు
నారాయణవనం: జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలు చేయకపోయినా, అతిక్రమించినా చర్యలు తప్పవని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని నారాయణవనం, పుత్తూరు, వడమాలపేట మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు, పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్నం భోజనంలో నాణ్యత లోపించడం, రికార్డు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, కొలతలు, స్టాక్ వివరాల్లో తేడా ఉండడం గమనించి మండిపడ్డారు. వెంటనే ఆయా నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వడమాలపేట మండలం ఎస్‌బీఆర్ పురం రేషన్ డీలర్, ఎస్‌బీఆర్ పురం, పుత్తూరు మండలం మజ్జిగగుంట ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మెమో ఇచ్చారు. నారాయణవనం మండలం కొండలచెరువు ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న కోడిగుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వడమలపేటలోని జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న బోజనం నాణ్యతను పరిశీలించారు. పౌర సరఫరాలశాఖ జిల్లా అధికారి శేషాచలంరాజు, ఎండీ బాలకృష్ణ, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి, అధికారులు రమణారావు, ఎన్.స్వామి, జగదీష్, విక్రాంత్ కుమార్, శ్యామ్ సుందర్, తిరుపతి సీఎంఓ సురేష్ పాల్గొన్నారు.


