ఉద్యమం.. ఉధృతం
ప్రైవేటీకరణపై సర్వత్రా ఆందోళన
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
నేడు జిల్లావ్యాప్తంగా నిరసన ర్యాలీలు
స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు
●
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం ఉధృతంగా మారింది. కోటి సంతకాల సేకరణతోపాటు వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ర్యాలీకి అన్నివర్గాల మద్దతు పెరుగుతోంది. బుధవారం ఈ మేరకు జిల్లావ్యాప్తంగా కదంతొక్కేందుకు ప్రజానీకం సన్నద్ధమవుతోంది. పేదలకు ఉచిత వైద్యం.. వైద్యవిద్యను దూరం చేస్తున్న చంద్రబాబు పాలనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దిశగా సాగిస్తున్న కుట్రలపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. జగనన్న పిలుపు మేరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ సన్నాహాలు పూర్తి చేసింది.
పేద విద్యార్థులు బలి
చంద్రబాబు కుట్రకు పేద విద్యార్థులు బలవుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి మరింత మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు అందించేందుకు కృషి చేసింది. కానీ, చంద్రబాబు సర్కారు దోపిడీ విధానంతో కార్పొరేట్లకు కాలేజీలను కట్టబెట్టి రూ.వేల కోట్లు దోచుకునేందుకు సిద్ధమైంది. పేద బిడ్డల కడుపుకొట్టింది. బాబు వైఖరిపై విద్యార్థుల తల్లిదండ్రులు రగిలిపోతున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారు. – డాక్టర్ ఓబుల్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
నిర్వీర్యం చేసే కుట్ర
చంద్రబాబు సర్కార్ వైద్య విద్యను నిర్వీర్యం చేసే కుట్రకు తెరతీయడం దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్ల నుంచి సుమా రు 3వేల ఎంబీబీఎస్ సీట్లు ప్రైవేటు పరం కావడంతో మెరిట్ విద్యార్థులకు వైద్య విద్య దూరమైంది. దీంతో నీట్‌లో 472మార్కులు సాధించిన విద్యార్థికి సైతం కన్వీనర్ కోటాలో సీటు రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
– అశోక్, యూనివర్సిటీల రాష్ట్ర కన్వీనర్, ఎస్‌ఎఫ్‌ఐ
తక్షణం ఉపసంహరించుకోవాలి
రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ప్రైవే టు పరం చేయడం దారుణం. ఒక్కో జిల్లాలో ఏడాదికి కన్వీనర్ కోటా కింద సుమారు 300మంది, బి–కేటగిరీలో సుమారు మరో 500మంది ఎంబీబీఎస్ సీట్లు కోల్పోతున్నా రు. ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి. లేకుంటే పోరాటం ఉధృతం చేస్తాం. – శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి
తిరుపతి తుడా/ తిరుపతి సిటీ : మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ఆందోళనకు విద్యార్థి లోకం పూర్తిగా మద్దతు పలికింది. చంద్రబాబు సర్కార్ వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కక్షపూరిత విధానాలను అమలు చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని పేద, మెరిట్ విద్యార్థులకు ఉచితంగా వైద్యవిద్యను అందించాలనే ఉన్నత లక్ష్యంతో గ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను నెలకొల్పారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నిస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా గత రెండేళ్లలో సుమారు 1,500మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీటు పొందలేకపోయారు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణకు పోరాటం


