అక్రమ అరెస్టులు అనుచితం
వెంకటగిరి రూరల్ : వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌లకు పాల్పడడం అనుచితమని పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బాబు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేత కొండూరు చంద్రశేఖర్‌రాజుని పెనమలూరులో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విడుదలై వచ్చిన చంద్రశేఖర్‌ను మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై కేసులు పెట్టవద్దని కోర్టులు హెచ్చరిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని వేధిస్తే, భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం వెంకటగిరి రాజ కుటుంబీకులు డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమ వారం అర్ధరాత్రి వరకు 76,096 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,289 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.01 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తు లు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.


