అమ్మవారి బ్రహ్మోత్సవాలు జయప్రదం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

అమ్మవారి బ్రహ్మోత్సవాలు జయప్రదం చేద్దాం

Nov 12 2025 5:41 AM | Updated on Nov 12 2025 5:41 AM

అమ్మవారి బ్రహ్మోత్సవాలు జయప్రదం చేద్దాం

అమ్మవారి బ్రహ్మోత్సవాలు జయప్రదం చేద్దాం

● భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక ● టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్‌ 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థానమండంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్‌ఓ మురళీకృష్ణతో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. తిరుచానూరు ఆలయం పరిసరాలు, పద్మసరోవరం, హోల్డింగ్‌ పాయింట్ల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజు దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు అన్నప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, పటిష్ట క్యూలైన్లు, జర్మన్‌ షెడ్లు, పారిశుద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. తిరుమల తరహాలో విద్యుత్‌ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడుతారన్నారు.

బ్రహ్మోత్సవాలకు రాష్ట్రపతి రాక

పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

17న పట్టువస్త్రాలను సమర్పించనున్న మంత్రి

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నవంబర్‌ 17న రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని తెలిపారు. నవంబర్‌ 25న పంచమి తీర్థం ఉత్సవాన్ని పురష్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి వచ్చే సారె ఊరేగింపు సందర్భంగా తిరుపతి నగరంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతకుముందు టీటీడీ ఈవో, కలెక్టర్‌, ఎస్పీ, జేఈవో, సీవీఎస్వోలు అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. సమావేశంలో ఆలయ అర్చకులు బాబు స్వామి, మణికంఠ స్వామి, సీఈ టి.వి. సత్యనారాయణ, ఎఫ్‌.ఎ అండ్‌ సీఏవో బాలాజీ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement