బైక్‌ను ఢీకొన్న బస్సు
● చికిత్స పొందుతూ ఒకరి మృతి
తిరుపతి రూరల్ : తిరుపతి– చంద్రగిరి మార్గంలోని తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల సమాచారం మేరకు... తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందిన వెంకటరెడ్డి, తన సోదరుడు హనుమంతరెడ్డి కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తిరుపతి నుంచి చంద్రగిరి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ఘటనలో వెంకటరెడ్డి, హనుమంతరెడ్డి ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ వెంకటరెడ్డి మంగళవారం మృతి చెందగా హనుమంతరెడ్డి గాయాలతో ఆసుపత్రిలోనే ఉన్నారు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాగరమాల పనులను
అడ్డుకున్న అన్నదాతలు
కోట : మండలంలోని కొత్తపాళెం వద్ద మంగళవారం సాగరమాల రోడ్డు నిర్మాణ పనులను కొత్తపాళెం, నెల్లూరుపల్లి గ్రామాల రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా తూర్పు కనుపూరు వరకు సాగరమాల రోడ్డు పనులు జరుగుతున్నాయి. విద్యానగర్ నుంచి కొత్తపాళెం వరకు పెన్నక్కచెరువు మీదుగా రోడ్డు వెలుతుంది. పెన్నక్క చెరువు నుంచి దిగువ ఆయకట్టుకు నీటిని తీసుకెళ్లే ఆరు పంట కాలువలను రోడ్డు నిర్మాణంలో భాగంగా పూడ్చి వేశారు. దీంతో రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు పెన్నక్కచెరువు నుంచి నీరు అందని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. దీంతో సాగరమాల రోడ్డు పనులను అడ్డుకున్నారు.
టీటీడీ ఉద్యోగికి రిమాండ్
తిరుపతి లీగల్ : చీటింగ్ కేసులో టీటీడీ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్యకు ఈనెల 24వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్ జడ్జి కోటేశ్వరరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నిందితుడు శంకరయ్య తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తానంటూ భక్తుల వద్ద అధిక డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు నిందితుడు శంకరయ్య పై చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడు శంకరయ్య ప్రజాప్రతినిధుల పీఆర్‌ఓ లను దర్శనాల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
పోలీసుల ముమ్మర తనిఖీలు
రేణిగుంట:ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వం హై అలర్ట్ ప్రకటించింది. అందులో భాగంగా రేణిగుంట విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌లో రూరల్ సీఐ మంజునాథరెడ్డి, అర్బన్ సీఐ జయచంద్ర, జీఆర్‌పీ, ఆర్పీఎఫ్ పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు.
బైక్‌ను ఢీకొన్న బస్సు
బైక్‌ను ఢీకొన్న బస్సు


