ప్రభుత్వ స్థలం కబ్జా
సాక్షి, టాస్క్‌పోర్సు : గూడూరు మండలం గాంధీనగర్ ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేటుగా బ్రిక్స్ యూనిట్ ఏర్పాటు చేసి ఓ టీడీపీ నేత కాసులు కొట్టేస్తున్నాడు. వివరాలు ఇలా.. గూడూరు మండలం గాంధీనగర్ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆ సమయంలో ఇల్లు కట్టుకునేందుకు స్థోమత లేని వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో తాత్కాలికంగా సిమెంట్ బ్రిక్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు మాత్రమే విక్రయించుకునేలా ఇటుకల తయారీ చేపట్టారు. అయితే ప్రభుత్వం మారి చంద్రబాబు అధికారం చేపట్టడంతో స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ఓ స్థానిక నాయకుడు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ యూనిట్‌ను ఖాళీ చేయించి తనకు అనుకూలంగా ఉన్న వారితో యూనిట్‌ను నడిపించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సిమెంట్ బ్రిక్స్ యూనిట్ సర్వే నంబర్ 1988–9పీ,లో 15 సెంట్లు, 1988–10పీలో 25 సెంట్లు, 1988–11పీలో 10 సెంట్లు భూమి మొత్తంగా 50 సెంట్లు భూమిని ఏడాదికి పైగా దర్జాగా వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే పక్కనే ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలంలో జామాయిల్ సాగు చేపట్టి దానికి పెన్సింగ్ వేసుకుని దర్జాగా ఆక్రమించేశారు.
విద్యుత్ కనెక్షన్ ఎలా ఇచ్చారో..
యూనిట్ ఏర్పాటుకు అవసరమైన త్రీ ఫేజ్ విద్యుత్ కనెక్షన్‌ను ఆ శాఖాధికారులు ఎలా ఇచ్చారు అనేది కూడా వారే చెప్పాలి. అదే స్థానిక ప్రజా ప్రతినిధి మాట చెప్పడమే తరువాయి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా త్రీ ఫేజ్‌లైన్ ఏర్పాటు చేసి బ్రిక్స్ యూనిట్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పట్టించుకోని అధికారులు
గూడూరు రూరల్ పరిధిలోని జగనన్న లే అవుట్‌లో ఉన్న రూ.లక్షలు విలువ చేసే 50 సెంట్ల భూమిని ఓ టీడీపీ నేత ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నా ఏ శాఖ అధికారి కూడా దీనిపై దృష్టిసారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై గూడూరు ఇన్‌చార్జి తహసీల్దార్ ఆర్‌వీ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఆ సర్వే నంబర్‌లో ఉన్న భూమిపై క్లారిటీ లేదని వీఆర్‌ఓను పంపి పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం చర్యలు చేపడతామని వివరణ ఇచ్చారు.


