శ్రీసిటీలో జర్మనీ ప్రతినిధుల బృందం
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : జర్మనీలోని సాక్సోనీ రాష్ట్రానికి చెందిన 18 మంది వాణిజ్య ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీ సిటీని సందర్శించింది. ఆ రాష్ట్ర వాణిజ్య, కార్మిక, ఇంధన, వాతావరణ శాఖ మంత్రి డిర్క్ పాంటర్ నేతృత్వంలో పర్యటనకు విచ్చేసిన ప్రతినిధులకు శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఒనగూరే వ్యూహాత్మక వ్యాపార ప్రయోజనాలను డాక్టర్ సన్నారెడ్డి వారికి వివరించారు. అనంతరం ప్రతినిధి బృందం స్థానిక బెల్ ఫ్లేవర్స్ – ఫ్రాగ్రెన్సెస్ పరిశ్రమను సందర్శించి, కార్యకలాపాలను పరిశీలించింది. ఈ పర్యటనలో ప్రధానంగా దుస్తులు, మెటల్ ఉత్పత్తులు, వైద్య పరికరాల తయారీ, నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణ కార్యక్రమాలలో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించారు.
వెంటాడిన మృత్యువు
రేణిగుంట : మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు పట్టణానికి చెందిన తల్లీ కొడుకు మృతి చెందిన సంఘటన మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కర్నూలు పట్టణానికి చెందిన కె.ఎన్. చంద్రభాను సింగ్ (37), ఓ మెడికల్ కంపెనీలో ఏరియా బిజినెస్ మేనేజర్‌గా పనిచేస్తూ తన తల్లి సరస్వతీ భాయ్ (63), భార్య శ్రీదివ్య (24), కుమార్తె త్రీక్షణ సింగ్ (5)తో కలిసి కర్నూలు నుంచి కారులో చైన్నెకు వెళుతుండగా మార్గ మధ్యలోని రేణిగుంట మండలం శ్రీనివాసపురం సమీపంలో కారును అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో చంద్రభాను సింగ్ అక్కడికక్కడే మరణించగా, ఆయన తల్లి సరస్వతీ భాయ్ తీవ్ర గాయాలతో రుయా ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రభాను భార్య శ్రీదివ్య స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే చిన్నారి త్రీక్షణ సింగ్ సురక్షితంగా బయటపడ్డారు.
శ్రీసిటీలో జర్మనీ ప్రతినిధుల బృందం
శ్రీసిటీలో జర్మనీ ప్రతినిధుల బృందం


