పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన
పెళ్లకూరు:ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.11 లక్షల కోట్లతో పరిశ్రమల స్థాపన కోసం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసినట్లు జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం పాలచ్చూరు, శిరసనంబేడు ఏపీఐఐసీ భూముల్లో కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీతో కలిసి ఆయన 3ఎక్స్‌ప్రే, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల స్థాపనకు భూమిపూజ చేసి శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అలాగే దమ్ము బయో ప్యూయెల్ ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో కిరణ్మయి, పేట డీఎస్పీ చెంచుబాబు, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, నాయకులు అనీల్‌కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, కృష్ణయ్య, ప్రసాద్‌నాయుడు, మధన్‌నాయుడు పాల్గొన్నారు.
వసతిగృహం నుంచి
బాలికలు అదృశ్యం
తిరుపతి రూరల్:తిరుపతి సాయినగర్ పంచాయ తీ పరిధిలోని బైరాగిపట్టెడలోని మాతృశ్య వసతి గృహం నుంచి ఇద్దరు చిన్నారులు తప్పిపోవడంతో నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. తిరుపతి నగరంలోని జీవకోనకు చెందిన 12 ఏళ్ల బాలిక, గొల్లపల్లికి చెందిన 8 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు నిర్వాహకులు వారి చిత్రాలను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. సీఐ చిన్నగోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెక్ బౌన్స్ కేసులో
నిందితుడికి జైలు
తిరుపతి లీగల్ : చెక్ బౌన్స్ కేసులో తిరుపతి నగరం లక్ష్మీపురానికి చెందిన మధుకు 6 నెలలు జైలు శిక్ష, ఐదువేల రూపాయలు జరిమానా విధిస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్ జడ్జి కోటేశ్వరరావు మంగళవారం తీర్పు చెప్పారు. సాయినగర్‌కు చెందిన ప్రసాద్ వద్ద మధు 2015 మార్చి 27వ తేదీ రూ.4 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము చెల్లించే క్రమంలో అసలు, వడ్డీ కలిపి 2018 ఫిబ్రవరి 27వ తేదీ ఓ చెక్కును అతడు ప్రసాద్ కు ఇచ్చాడు. ఆ చెక్కును బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. దీంతో మధు పై ప్రసాద్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశాడు. నేరం మధు పై రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.


