ర్యాగింగ్ సరదా కాదు.. అమానుషం
– ఎస్పీ సుబ్బారాయుడు
తిరుపతి సిటీ:ర్యాగింగ్ సరదా కాదు.. అని అదో అమా నుష ప్రక్రియ అని అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. మంగళవారం ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియం వేదికగా స్టూడెంట్స్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థుల్లో మానవతా విలువలను పెంపొందించడమే విద్య ప్రధాన లక్ష్యమన్నారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థి మనోభావాలను దెబ్బతీయడం, మానవత్వం కాదన్నారు. కొత్తగా యూనివర్సిటీలో అడుగు పెట్టిన విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేయడం నేరమన్నారు. జూనియర్లను స్నేహపూర్వకంగా ప్రోత్సహించడం ప్రతి సీనియర్ బాధ్యతని, ర్యాగింగ్ ద్వారా ఎవరికీ ఆనందం రాదని, అది ఎదుటివారికి మానసిక క్షోభను కలిగిస్తుందన్నారు. అలాంటి ఘటనలు జరిగితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ర్యాగింగ్ ఘటనపై ఫిర్యాదు చేసిన వారికి పూర్తి రక్షణ, న్యాయం అందించనున్నట్లు ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం వీసీ ప్రొఫెసర్ నర్సింగరావు మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది విద్యార్థి జీవితాన్ని దెబ్బతీసే దుర్మార్గమైన అలవాటని, ఎస్వీయూలో ప్రతి విద్యార్థీ సురక్షిత వాతావరణంలో చదువుకునే హక్కు ఉందన్నారు. ఆ హక్కుకు ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, రెక్టార్ అప్పారావు, డీఎస్పీ భక్తవత్సలం పాల్గొన్నారు.


