శ్రీహరికోటకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సూళ్లూరుపేట: పట్టణంలోని మన్నారు పోలూరు విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి శ్రీహరికోటకు వెళ్లే 33–11 కేవీ విద్యుత్ లైన్ పులికాట్ సరస్సుకు మధ్యలో తెగిపోయింది. శ్రీహరికోటలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఏడీఈ శేఖర్, ఏఈ జగదీస్, లైన్ ఇన్‌స్పెక్టర్ రఫీ వారి సిబ్బంది వెంటనే స్పందించి ఎక్కడ తెగింది అనే దానిపై పులికాట్ సరస్సు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను పరిశీలించగా కుదిరి–అటకానితిప్ప మద్యలో విద్యుత్ వైర్లు తెగిపోవడాన్ని గుర్తించారు. అయితే పులికాట్ సరస్సులో ఉప్పు వల్ల తుప్పు పట్టి ఇలా తెగిపోవడం సహజమే. ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో విద్యుత్ వైర్లు మార్చాల్సి ఉంది. విద్యుత్ వైర్లు తెగిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. వెంటనే విద్యుత్ సరఫరా అపేసి మరమ్మతులు చేసి శ్రీహరికోటకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
పులికాట్ సరస్సులో విద్యుత్ లైన్
మరమ్మతు చేస్తున్న ట్రాన్స్‌కో సిబ్బంది


