మోటార్ బైక్‌ను ఢీకొన్న బస్సు..ఒకరి మృతి
నాయుడుపేటటౌన్: పట్టణంలోని కేకే కల్యాణ మండపం సమీపంలో సోమవారం సాయంత్రం ఓ ప్రైవేటు బస్సు మోటార్ బైక్ ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషయంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. పెళ్లకూరు మండలం అర్ధమాల గ్రామానికి చెందిన ఏ శివ(27), నాయుడుపేట మండలం చిలమాత్తురు గ్రామానికి చెందిన గొనుపల్లి శ్రావణి బైక్‌పై పెళ్లకూరు గ్రామం వైపు నుంచి నాయుడుపేటకు వస్తున్నారు. నాయుడుపేట బైపాస్‌రోడ్డులోని కేకే కల్యాణ మండపం సమీపంలో వారి బైక్‌ను మేనకూరు సెజ్‌లోని ఓ పరిశ్రమకు ఉద్యోగులను తరలించే ప్రైవేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్‌లో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. శ్రావణి పరిస్థితి విషయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ బాబి సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


