అమ్మా...ఒక్కసారి రావా?
చిల్లకూరు : పుట్టిన నాటి నుంచి ఏడేళ్ల వరకు కంటికి రెప్పలా చూసుకున్న కన్న తల్లి అటు తరువాత కుమారుడిని వదలివెళ్లి పోయింది. దీంతో ఆ చిన్నారి ఆరోగ్యం దెబ్బతిని నడవలేని స్థితికి చేరుకున్నాడు. అలాంటి స్థితిలో బాలుడిని కన్న తండ్రి చూసుకుంటుండగా రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించి ఆ బాలుడు మంచానికే పరిమితం అయ్యాడు. తండ్రి ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో వృద్ధాప్యంలో ఉండే నాయనమ్మ, తాతయ్య బాలుడికి ఆధారం అవుతున్నారు. అయితే బాలుడు ఇటీవల కన్నతల్లి కోసం మారాం చేస్తూ అమ్మ కావాలి అని విలపిస్తున్నాడు. ఈ సంఘటన గూడూరు పట్టణంలోని దూడల కాలువ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటుగా వెళ్లే వారు ఆ చిన్నారిని చూసి జాలిపడకుండా ఉండలేకున్నారు.
గూడూరు పట్టణంలోని దూడల కాలువ ప్రాంతంలోని విగ్నేశ్వరపురంలో నివాసం ఉండే నాగరాజుకు 15 ఏళ్ల కిందట బంధువుల కుటుంబంలోని యువతితో వివాహం అయ్యింది. అటు తరువాత ఏడాదికి ఒక బాబు పుట్టగా అతడికి మహదీప్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉన్నారు. బాబుకు ఐదేళ్లు వచ్చిన తరువాత కాళ్లు వంకర్లు తిరిగి పోయి నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో ఆసుపత్రల్లో చూపించారు. వ్యాధి నయం కాకపోగా శరీరం ఊబయ కాయంగా మారింది. అప్పడు బాబుకు ఏడేళ్లు పూర్తవుతున్న సమయంలో బాబు తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో బాబు తండ్రి నాగరాజు పలు ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకపోయింది. అయితే నేడు బాబుకు 14 ఏళ్లు వచ్చే సరికే అతడికి తల్లి గుర్తుకు వచ్చి అమ్మ కావాలి అని ఏడుస్తూ అన్నం తినకుండా విలపిస్తుండడం చూసి తండ్రి , నాయనమ్మ, తాతయ్య అతడిని ఓదార్చలేక అల్లాడిపోతున్నారు. కన్నతల్లి కోసం మతి స్థితిమితం లేని ఆ కుమారుడు పడుతున్న వేదనను గుర్తించి తల్లి ఎక్కడున్నా రావాలని కోరుతున్నారు.


