9న తిరుమలలో కార్తీక వన భోజనం
తిరుమల : కార్తీక వనభోజన కార్యక్రమం నవంబరు 9న తిరుమలలోని గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో జరగనుంది. కార్తీక మాసంలో వన భోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు మలయప్ప స్వామి చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఊరేగింపు ఉండనుంది. ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
19న స్వర్ణముఖి నదీ హారతులు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ స్వర్ణముఖి నదీ హారతులు ఇస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు తెలిపారు.
గ్రామస్తులపై తిరగబడ్డ ఇసుకాసురులు
నాయుడుపేటటౌన్ : మండల పరిధిలోని చిగురుపాడులో స్వర్ణముఖి నది వద్ద ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు చేస్తుండడంతో శనివారం సాయంత్రం గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో స్వర్ణముఖి నది వద్ద అధికారులు వేసిన అడ్డుకట్టను తెగ్గొట్టి ఏకంగా జెసీబీతో ఇసుక అక్రమ రవాణాకు పూనుకున్నారు. దీంతో గ్రామస్తులు వారిని వారించారు. దీంతో ఇసుకాసురులు తిరగబడి గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.


