ఏర్పేడు : తన భర్తను దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సారిక అనే యువతి శనివారం పిల్లలు, బంధువులతో కలిసి రేణిగుంట విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కోసం ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరీక్షించారు. పాత టెర్మినల్ వద్ద పవన్ కాన్వాయ్ సమీపిస్తుండటంతో గట్టిగా కేకలు పెట్టినా కాన్వాయ్ ఆపకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు.. కేవీబీపురం మండలం పవనివారికండ్రిగ గ్రామానికి చెందిన తన భర్త బొడుగు దామోదరం సౌదీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తూ 15రోజుల కిందట ఇంటికి వచ్చాడని ఆమె తెలిపింది. అయితే గ్రామ సర్పంచ్ చెంచుప్రకాష్ యాదవ్ పంచాయతీ నిధులు రూ.2 కోట్లుకు పైగా అక్రమాలకు పాల్పడి స్వాహా చేశాడని సోమవారం కొందరు యువకులు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. అయితే తన భర్త దామోదరం ఇదంతా చేయిస్తున్నాడని కక్ష పెంచుకున్న సర్పంచ్ ఈనెల 4వ తేదీన ఇంట్లో ఉన్న తన భర్త దామోదరంపై గొడవకు వచ్చి మూకుమ్మడిగా దాడికి పాల్పడి తలపై బలంగా కొట్టి గాయపరిచారన్నారు. అడ్డు వచ్చిన దామోదరం తల్లి బొడుగు రత్నమ్మ, చింత శ్రీనివాసులు, మణిలను కొట్టి గాయపరిచారన్నారు. అయితే తీవ్రంగా గాయపడిన దామోదరం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగానే ఉందని ఆమె వివరించింది. తన భర్త దామోదరం పై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా కేవీబీపురం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె వాపోయారు.


