దుంగలు, కేసులు సరే..దొంగలేరీ!
చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి భారీగా తరలుతున్న ఎర్రచందనం జాతీయ సందపను కాపాడుకోవడంలో యంత్రాంగం విఫలం స్మగ్లర్లకు నేతల అండ.. అరెస్టులు,పీడీ యాక్టులపై మౌనం
బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి సమీపంలో పలమనేరు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న ఎర్రదుంగలు(ఫైల్)
చిత్తూరు అర్బన్: శేషాచల అడవుల్లో గొడళ్ల చప్పుళ్లు ఆగనంటున్నాయి. రంపపు కోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎర్రచందనం వృక్షాలకు కత్తుల గాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. గత రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఎర్ర చందనం దుంగలను తరలిస్తూనే ఉన్నారు. స్మగ్లర్లను పట్టుకుంటే అధికార పార్టీ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లకు యంత్రాంగం తలొగ్గుతోందనే ప్రచారం సాగుతోంది.
మనకు మాత్రమే..
ఎర్రచందనం చెట్లు వాతావరణం, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లోని నేలల్లో మాత్రమే పెరుగుతుంది. తిరుపతి, తిరుమల, శేషాచల అడవులు, చిత్తూరు, యాదమరి, పూతలపట్టు, పుంగనూరు, సదుం, సోమల, కార్వేటినగరం, ఎస్‌ఆర్.పురం, పులిచెర్ల, పలమనేరు ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ విభాగం, అటవీశాఖ అధికారులు ఉన్నా కూడా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. చిత్తూరులో గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఎస్‌బీఎక్స్ పేరిట ప్రత్యేక విభాగం పనిచేసేది. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. శాంతిభద్రతలు పర్యవేక్షించే ఆయా పోలీస్ స్టేషన్ అధికారులే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను కూడా చూడాలి. స్పెషల్‌బ్రాంచ్, ఈగల్ లాంటి విభాగాలున్నా ఎర్ర బంగారం దోచుకెళ్లే నేరస్తులపై నిఘా ఉంచడం లేదనే విమర్శలున్నాయి.
శేషాచలనంలో అవే చప్పుళ్లు
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు నేలకూల్చని రోజంటూ ఉండదు. తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో వచ్చే కూలీలు ఎర్రచందనం చెట్లను కొట్టి, వాటిని రవాణా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పగలు–రేయి తేడా లేకుండా గొడ్డళ్లు, పదునైన కత్తులతో రోజుకు వందల సంఖ్యలో ఎర్రచందనం వృక్షాలను నరికేస్తున్నారు. కానీ వీళ్ల వెనుక ఉన్న డాన్‌లను మాత్రం ఎవ్వరూ పట్టుకోవడం లేదు. కూలీలపై కేసులు పెట్టి చేతులు దుపులుకుంటున్నారే తప్ప.. కింగ్‌పిన్ ఎవరనే కనీస విచారణ కూడా చేయడం లేదనే విమర్శలున్నాయి.
నామమాత్రపు తనిఖీలు
ఎర్రబంగారం చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి దేశ, విదేశాలకు తరలుతోంది. తమిళనాడులోని పలు సముద్ర తీరాల్లోని కంటైనర్ల ద్వారా విదేశాలకు వెళుతున్న ఎర్రచందనం దుంగలను జిల్లా సరిహద్దుల్లోనే నిలువరించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు మునుపు చిత్తూరు జిల్లాలో 92 ప్రాంతాల్లో చెక్‌పోస్టులుండగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12కే పరిమితం కావడం అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు స్మగ్లర్లను పట్టుకుంటే రాజకీయ నేతల నుంచి ఫోన్లు రావడం, ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేయడం సర్వసాధారణగా మారిపోయింది. ఏడాదిన్నరకాలంలో ఒక్క స్మగ్లర్‌పై కూడా పీడీ యాక్టు పెట్టలేదంటే అధికారుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
చిత్తూరు జిల్లాలో 2024–25లో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పది కేసులు, అటవీశాఖ అధికారులు ఓ కేసు నమోదు చేశారు. ఇందులో 42 మందిని అరెస్టు చేసి, 518 ఎర్రచందనం దుంగలను, 14 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2025–26కు ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేసి.. 32 ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తిరుపతిలో పోలీసు, అటవీశాఖ కలిపి ఈ ఏడాది తొలి నుంచి జూన్ వరకు 28 కేసులు నమోదుచేస్తే, 105 మంది నిందితులను అరెస్టు చేశారు. 1,169 ఎర్రచందనం దుంగలు, 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


